
టీబీ నిర్మూలనకు కృషి చేయాలి
మంచిర్యాలటౌన్: జిల్లాలో టీబీ నిర్మూలనకు వైద్యారోగ్య సిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీశ్‌రాజ్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు, వైద్యాధికారులు, ఎంఎల్‌హెచ్‌పీ, సూపర్‌వైజర్లు, టీబీ నియంత్రణ అధికారులు, సిబ్బందికి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా చేపట్టిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో ఈ నెల 19నుంచి వందరోజులపాటు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. టీబీని త్వరగా గుర్తించి సరైన చికిత్స అందించాలని పేర్కొన్నారు. మధుమేహం, హెచ్‌ఐవీ, క్యాన్సర్, గుండె, కిడ్నీ, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని వందశాతం ప్రభావిత ప్రాంతాల్లో వైద్యశిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతీ గ్రామంలో ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, ఎంఎల్‌హెచ్‌పీల ద్వారా వ్యాధిగ్రస్తులను గుర్తించి, అక్కడే పరీక్షలు నిర్వహించేందుకు రెండు వాహనాలు కేటాయించినట్లు వివరించారు. ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుధాకర్‌నాయక్, డాక్టర్ ఎస్.అనిత, డాక్టర్ ఎ.ప్రసాద్, డాక్టర్ కృపాబాయి, డాక్టర్ అనిల్, జిల్లా టీబీ మేనేజర్ సురేందర్, మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.