
136 క్వింటాళ్ల జొన్నలు సీజ్
తాంసి: మండల కేంద్రంలోని సబ్ మార్కెట్‌యార్డుకు మంగళవారం బయటి వ్యక్తులు తీసుకువచ్చిన 136 క్వింటాళ్ల జొన్నలను సీజ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. జొన్నల అక్రమదందాలో భాగంగా వ్యాపారులు తాంసి కొనుగోలు కేంద్రంలో విక్రయించడానికి తీసుకువచ్చిన జొన్నలను గమనించిన రైతులు నాణ్యతగా లేకపోవడం, బూజుపట్టి ఉండడంతో అధికారులకు సమాచారం అందించారు. మండల వ్యవసాయాధికారి రవీందర్, కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి కేశవ్, ఎస్సై దివ్యభారతి జొన్నలను పరిశీలించి ఎవరివని ఆరా తీయగా ఎవరూ ముందుకు రాలేదు. 272 సంచుల్లో మొత్తం 136 క్వింటాళ్లు ఉన్నట్లుగా ఏవో రవీందర్ పేర్కొన్నారు. జొన్నలతో పాటు వాటిని తరలించిన మ్యాక్స్ వాహనాన్ని సైతం గుర్తించి పోలీసులకు అప్పగించినట్లు ఏవో తెలిపారు. కాగా ఇప్పటికే తాంసి సబ్ మార్కెట్‌యార్డులో అక్రమంగా వ్యాపారులు మహారాష్ట్ర నుంచి జొన్నలను తీసుకొచ్చి పెద్దఎత్తున విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం తాంసి కొనుగోలు కేంద్రానికి మహారాష్ట్ర నుంచి అక్రమంగా జొన్నలను తీసుకొచ్చే క్రమంలో నిపాని వద్ద భీంపూర్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే.