
ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్
భైంసాటౌన్: పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ అవినాష్‌కుమార్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలోని నిర్మల్ రోడ్‌లో ఖడ్డా హోటల్ సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బంగాలగల్లికి చెందిన ముజాహిద్ ఖాన్ అలియాస్ సుల్తాన్ అలియాస్ ఇంతియాజ్, ఓవైసీనగర్‌కు చెందిన షేక్ అహ్మద్ పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. దీంతో వారిని వెంబడించి పట్టుకోగా వారి వద్ద కిలోన్నర ఎండు గంజాయి లభించినట్లు పేర్కొన్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ గోపీనాథ్‌తో పాటు ఎస్సై జి.శ్రీనివాస్, కానిస్టేబుళ్లు ప్రమోద్, క్రాంతి, శరత్, హరిబాబు, బాలాజీని అభినందించారు.
నిర్మల్‌లో...
నిర్మల్‌టౌన్: నిర్మల్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఏఎస్సీ రాజేశ్ మీనా తెలిపారు. మంగళవారం పోలీస్ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన షేక్ నిజాముద్దీన్ స్థానిక బస్టాండ్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తుండగా పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ పట్టుకున్నారు. అతని వద్ద 200 గ్రాముల గంజాయి లభించడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
గంజాయి సాగు చేస్తున్న ఇద్దరు అరెస్ట్
నిర్మల్‌టౌన్: గంజాయి సాగు చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ రాజేశ్ మీనా తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. పెంబి మండలంలోని చిన్న గోధుమల గ్రామానికి చెందిన కొమరం దండురావు తన పంటచేనులో కూరగాయల చెట్ల మధ్యలో 14 గంజాయి మొక్కలు, పోచంపల్లి గ్రామానికి చెందిన మెగావత్ కై లాష్ రెండు గంజాయి మొక్కలు సాగు చేయగా పక్కా సమాచారం మేరకు ఖానాపూర్ సీఐ అజయ్, పెంబి ఎస్సై హన్మాండ్లు సోమవారం దాడులు నిర్వహించారు. దండురావు వద్ద నుంచి రూ.లక్షా 40 వేల విలువ గల 14 గంజాయి మొక్కలు, కై లాష్ వద్ద రూ.20వేల విలువగల రెండు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.