
ఆదివాసీలు అస్తిత్వాన్ని కాపాడుకోవాలి
● మంత్రి సీతక్క
జన్నారం: ఆదివాసీలది ఏడు తరాల చరిత్ర అని, తాత ముత్తాతలు ఇచ్చిన అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆదివాసీలందరిపై ఉందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జన్నారం హరిత రిసార్ట్‌లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి మంగళవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆదివాసీల జీవన విధానం ప్రత్యేకంగా ఉంటుందన్నారు. కేస్లాపూర్‌లో నాగోబా, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలతో పాటు, చెట్లు, పుట్టలను పూజిస్తారన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ వనవాసి పేరుతో మను ధర్మాన్ని ఆదివాసీలపై రుద్దేందుకు ప్రయత్నిస్తుందని, దీనిని ఆదివాసీలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఉపయోగపడే రోడ్లు, నివాస స్థలాలకు అనుమతులివ్వని ప్రధాని మోదీ ఆదివాసీలు నివాసం ఉండే అడవులు, గుట్టలను తవ్వుకునేందుకు అంబానీలాంటి వారికి అనుమతులిస్తున్నారని విమర్శించారు. ఆదివాసీలు చదువుపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. రాజకీయ శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను చైతన్య పరచాలన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని రాహుల్ గాంధీ అడ్డుకున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జాతీయ ఆదివాసీ శిక్షణ ప్రోగ్రాం కన్వీనర్ రాహుల్ బల్, పార్టీ ఎస్సీ, ఎస్టీ సెల్ జాతీయ అధ్యక్షుడు కొప్పుల రాజు, చెన్నూర్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వెడ్మ బొజ్జు పటేల్, మాజీమంత్రి వేణు గోపాలాచారి, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.