
వైద్యుల గైర్హాజరుకు చెక్
● నేటి నుంచి ముఖ ఆధారిత గుర్తింపుతోనే హాజరు ● వైద్య కళాశాల, అనుబంధ ఆస్పత్రుల్లో అమలు ● ఎన్‌ఎంసీ ఆదేశాలతో బయోమెట్రిక్‌కు స్వస్తి
మంచిర్యాలటౌన్: ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసిబ్బంది గైర్హాజరుకు చెక్ పడనుంది. నేటి నుంచి ముఖ ఆధారిత గుర్తింపు(ఫేస్ బేస్‌డ్ ఆధార్ అథెంటికేషన్) హాజరు అమలుకు జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) చర్యలు చేపట్టింది. మంచిర్యాల వైద్య కళాశాలతోపాటు అనుబంధంగా కొనసాగుతున్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, మాతాశిశు ఆరోగ్య కేంద్రంలోని వైద్యులు, బోధకులు, సహాయ బోధకులు, అసోసియేట్లు అందరూ తప్పనిసరిగా ఫేస్ రికగ్నేషన్ విధానంతోనే హాజరు వేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం వైద్య కళాశాలలోని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, మాతాశిశు ఆరోగ్య కేంద్రం కారిడార్‌ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఆయా ప్రాంతాల అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా నమోదు చేసిన వీటి పరిధిలోని వంద మీటర్ల లోపు ఉండి ముఖ ఆధారిత గుర్తింపు ద్వారా హాజరు నమోదు చేస్తేనే హాజరు పడనుంది. ఫేస్‌బేస్‌డ్ ఆధార్ అథెంటికేషన్‌కు సంబంధించిన మూడు యంత్రాలు ఎన్‌ఎంసీ నుంచి రావాల్సి ఉండగా.. ప్రస్తుతం మొబైల్ ఫోన్‌లోనే యాప్ ద్వారా హాజరు నమోదు చేసుకోనున్నారు. గత వారం రోజులుగా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేస్తున్నారు. ఈ విధానంతో కొందరు ఇష్టారీతిగా హాజరు నమోదు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తుండడంతో సమయపాలన పాటించడం లేదు. వారి సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదు. కొత్త విధానంతో బయోమెట్రిక్‌కు స్వస్తి పలుకుతోంది.
కొత్త విధానం అమలు
మే ఒకటి నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, బోధన వైద్యులు హాజరు ఇకపై కొత్త విధానంలోనే తీసుకోవడం జరుగుతుంది. కచ్చితమైన హాజరు కోసం ఎంసీహెచ్, జీజీహెచ్, మెడికల్ కాలేజీకి మూడు మిషన్లు ఎన్‌ఎంసీ నుంచి రావాల్సి ఉంది. అప్పటివరకు మొబైల్ యాప్‌ను వినియోగించి హాజరు నమోదు చేసుకోవడం జరుగుతుంది.
– ఎండి.సులేమాన్, మంచిర్యాల ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్

వైద్యుల గైర్హాజరుకు చెక్