
నకిలీ పత్రాల కేసులో తవ్వినకొద్దీ అక్రమాలు
ఇచ్చోడ: నకిలీ నివాస ధ్రువీకరణ పత్రాల ద్వారా కొలువులు సాధించిన కేసులో తవ్విన కొద్దీ అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ, ఇంద్రవెల్లి మండలాల్లో నివాసం ఉంటున్నట్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగాలు సాధించిన విషయంపై మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో పోలీసు, రెవెన్యూ యంత్రాగం విచారణకు రంగంలోకి దిగింది.
మరో తొమ్మిది మందిపై ఫిర్యాదు...
గతంలో ఇచ్చోడ డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసిన జాదవ్ రామారావు (ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీగా పనిచేస్తున్నారు) తన డిజిటిల్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇస్లాంనగర్ గ్రామ నివాస ధ్రువీకరణ పత్రాలు మార్ఫింగ్ చేసిన అంకిత్‌పటేల్, బిపిన్‌యాదవ్, అతుల్‌కుమార్‌యాదవ్, ఘాన్‌శ్యామ్ తివారి, జైనులొద్దీన్, తివారికుల్‌దీప్, అభిద్‌ఖాన్, సురాజ్‌సహని, విశ్వుకర్మపై సోమవారం రాత్రి ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
నకిలీ విషయంలో గోప్యత...
నకిలీ ధ్రువీకరణ పత్రాల ద్వారా ఉద్యోగాలు పొందిన 8 మంది సర్టిఫికెట్లు పరిశీలనలో నకిలీవని గుర్తించిన రెవెన్యూ అధికారులు ఈ విషయంలో గోప్యత పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. బీఎస్‌ఎఫ్‌లో ఉద్యోగాలు పొందిన 8 మంది వ్యక్తుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించాలని 2025 మార్చి 8న కమాండెంట్ 53 బెటాలియన్ ఐటీబీపీ ఫోర్స్ మండలం కలికిరి, అన్నమయ్య జిల్లా అధికారులు ఆదిలాబాద్ కలెక్టర్‌ను కోరారు. సంబంధిత పత్రాలు పరిశీలించి పంపించాలని కలెక్టరేట్ అధికారులు ఇచ్చోడ తహసీల్దార్‌ను ఆదేశించారు. వాటిని పరిశీలించిన తహసీల్దార్ నకిలీ పత్రాలుగా గుర్తించారు. దీనిపై పోలీసులకుగానీ జిల్లా అధికారులకు గానీ ఫిర్యాదు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.
స్థానికంగా ఉండేవారి అండతోనే నివాస ధ్రువీకరణ పత్రాల మార్ఫింగ్ చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు ఈ దిశగా విచారణ జరిపితే అసలు దోషులు బయటపడే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.
మరో 9 మందిపై ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
సిరాజ్ అన్సారీ అనే వ్యక్తి 2025 జనవరి 16లో ఆర్‌సీ 022511735376 నంబర్ ద్వారా మీసేవలో నివాస ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఇదే నంబర్ మహబూబ్‌నగర్ జిల్లాలోని శేర్ వెంకటాపురం అశ్విని అనే అమ్మాయి పేరుతో జారీ అయిన ధ్రువీకరణపత్రాన్ని ఇచ్చోడ మండలంలోని ఇస్లాంనగర్ నివాసిగా సిరాజ్ అన్సారీ మార్ఫింగ్ చేశారు.