
గోదావరి తీరం.. ప్రమాదకరం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల పట్టణంలోని గోదావరి నదీతీరం, పుణ్యస్నానాలకు వచ్చే ప్రజలకు ప్రమాదకరంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి శివరాత్రి, బంధువుల మరణానంతరం స్నానాల కోసం వచ్చే వారికి ఈ తీరం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం గుంతలు, లోతైన కాలువలతో ప్రమాద స్థితిలో ఉంది. శివరాత్రి సమయంలో నది ఆవలివైపు నీటిని మంచిర్యాల వైపు ప్రవహించేందుకు తవ్విన కాలువలో గుర్రపు డెక్కలు మొలిచాయి. తవ్విన ఇసుకను ఇరువైపులా పోయడంతో నదిలో లోతును అంచనా వేయడం కష్టమైంది. ఇసుక, మట్టి తవ్వకాల వల్ల ఏర్పడిన పెద్ద గుంతలు, వర్షాల సమయంలో వరద నీటితో నిండి, స్నానం చేసేవారికి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.
పుష్కరఘాట్‌లపై అశ్రద్ధ
గోదావరి పుష్కరాల సమయంలో నిర్మించిన ఘాట్‌లు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఘాట్‌ల వద్ద నల్లాల నుంచి నిరంతరం పారే నీటితో పాకురు పెరుగుతోంది. దీంతో జారిపడే ప్రమాదం పొంచి ఉంది. నదిలో నీరు లేకపోవడంతో, ఆవలి వైపు వెళ్లలేనివారు నల్లా కింద స్నానాలు చేస్తున్నారు. ఈ పాకురు ప్రాంతం, నిరంతరం నల్లాలు ఆన్‌లో ఉండడంతో మరింత ప్రమాదకరంగా మారుతోంది.
సురక్షిత చర్యలకు విజ్ఞప్తి..
మంచిర్యాలతోపాటు జిల్లా వ్యాప్తంగా వచ్చే ప్రజల సురక్షత కోసం కనీసం సూచిక బోర్డులైనా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. గుంతలు, పాకురు ప్రాంతాలను గుర్తించేందుకు తగిన హెచ్చరికలు, భద్రతా చర్యలు అవసరమని వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే ఈ సమస్యను పరిష్కరించి, గోదావరి తీరాన్ని సురక్షితంగా మార్చాలని కోరుతున్నారు.
నీటి మళ్లింపు గుంతల్లో
పెరిగిన గుర్రపు డెక్క
మట్టి తరలింపుతో ప్రమాదకర
గుంతలు
పుష్కరఘాట్‌లపై పాకురు

గోదావరి తీరం.. ప్రమాదకరం