
జీపీలకు నిలిచిన నిధులు
● ఆర్థిక సంఘం నిధులు రాక పాలన అస్తవ్యస్తం ● గ్రామాల్లో కుంటుపడిన అభివృద్ధి
ఉమ్మడి జిల్లా వివరాలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్)/కుంటాల: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. దీంతో పాలకవర్గాలు లేక స్థానిక సంస్థలకు నిధులు నిలిచిపోయాయి. దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ల పాలకవర్గాల పదవీ కాల పరిమితి ముగియడంతో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను నిలిపివేసింది. రాష్ట్రం ప్రభుత్వం కూడా స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో 15 నెలలుగా పల్లెల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల నిర్వహణ కష్టతరంగా మారింది. చేసేది లేక గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు అప్పులు చేసి మరీ అత్యవసర పనులు చేయిస్తున్నారు.
నిలిచిన ఆర్థిక సంఘం నిధులు..
స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆయా గ్రామాల జనాభాను బట్టి ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తుంది. కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్ర గ్రాంట్ కూడా అందులో కలిపి ఇవ్వాలనే నిబంధన ఉంది. అయితే పాలకవర్గాలు లేకపోవడంతో ఆర్థిక సంఘం నిధుల విడుదల నిలిపివేసింది.
అప్పుల్లో కార్యదర్శులు..
గ్రామాల్లో అభివృద్ధి మాట దేవుడెరుగు..రాబోయే వర్షాకాలంలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ప్రతీనెల విద్యుత్ బిల్లులు, ట్రాక్టర్ ఈఎంఐలు, పారిశుధ్య కార్మికులకు వేతనా లు, వీధి దీపాల నిర్వహణ, తదితర పనులకోసం అప్పులు చేయాల్సి వచ్చిందని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు వస్తాయనే ఆశతో కార్యదర్శులు అప్పులు తీసుకువచ్చి మరీ పనులు చేయిస్తున్నారు. సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో ఇటు బిల్లులు రాక అటు వడ్డీలు పెరిగి అప్పుల పాలవుతున్నారు. మండల పరిషత్‌లకు సంబంధించి రెండేళ్ల నుంచి ఎంపీడీవోల వాహనాలకు అద్దె చెల్లింపులు, ఇంటర్‌నెట్ బిల్లులు, కరంట్ బిల్లుల చెల్లింపులు పెండింగ్‌లో ఉ న్నాయి. జిల్లా పరిషత్‌లలో నిల్వ ఉన్న ఫండ్‌తో కార్యాలయ నిర్వహణ కొనసాగిస్తుండగా రానున్న రోజుల్లో ఫండ్ అయిపోతే కార్యాలయ నిర్వహణ ప్రశ్నార్థకం కానుంది. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎ న్నికలు నిర్వహించి ఆర్థిక సంఘ నిధులు రెగ్యులర్‌గా విడుదల చేయించి గ్రామాల అభివృద్ధికి బాట లు వేయాలని కోరుతున్నారు.
ఆర్థిక సంఘం నిధుల ఖర్చు ఇలా..
కేంద్రం నుంచి జిల్లాకు వచ్చే మొత్తం నిధుల్లో 5 శాతం జిల్లా పరిషత్‌కు, 10 శాతం మండల పరిషత్‌కు, 85 శాతం గ్రామ పంచాయతీలకు కేటాయిస్తారు. దీంతో ఆయా పాలకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు వారి పరిధిలో అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉండేది. ఆ వచ్చిన నిధుల్లోనే 6 శాతం కార్యాలయాల నిర్వహణకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ 6 శాతం నిధులను విద్యుత్, నెట్ బిల్లులు, వాహనాల అద్దె చెల్లింపు, ఇతర ఖర్చులకు వినియోగించేవారు. కేంద్రం నిధులు నిలిపివేయడంతో ఇప్పుడు ఈ చెల్లింపులన్నీ నిలిచిపోయాయి.
ప్రత్యేక అధికారుల పాలనలోనే..
2024 ఫిబ్రవరితో గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాల పదవీ కాలం పూర్తయ్యింది. వెంటనే ఎన్నికల నిర్వహణ చేపట్టాల్సి ఉండగా కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలన పెట్టింది. ఏడాదిన్నర కావస్తున్నా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎలాంటి అడుగులు పడటం లేదు. ఇక మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల కాల పరిమితి కూడా 2024 జులై 5వ తేదీతో ముగిసిపోయింది. దీంతో పరిషత్ ఉన్నికల నిర్వహణ లేకపోవడంతో ఇక్కడ కూడా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.
జిల్లా పంచాయతీలు మండలాలు
ఆదిలాబాద్ 473 21
మంచిర్యాల 306 16
నిర్మల్ 396 19
కుమురంభీం 334 15
హాజీపూర్ మండలంలోని గఢ్‌పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం
నిర్వహణ భారంగా మారింది
పంచాయతీల అభివృద్ధికి మావంతు కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగానే పల్లె ప్రగతి కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం నిధులు విడుదల చేయక నిర్వహణ భారంగా మారింది.
– తిరుపతిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి,
కోలూరు, కుంటాల
ప్రతిపాదనలు పంపించాం
పంచాయతీలకు నిధులు విడుదల కాని మాట వాస్తవమే. నిధులు విడుదల చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. రెండు, మూడు రోజుల్లో పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ చేసే అవకాశాలు ఉన్నాయి. పంచాయతీల అభివృద్ధికి అందరం సమన్వయంతో పని చేయాలి.
– పీ.శ్రీనివాస్, డీపీవో, నిర్మల్

జీపీలకు నిలిచిన నిధులు

జీపీలకు నిలిచిన నిధులు