సెలవుల్లో.. శాశ్వత సెలవు | - | Sakshi
Sakshi News home page

సెలవుల్లో.. శాశ్వత సెలవు

May 24 2025 12:06 AM | Updated on May 24 2025 12:06 AM

సెలవు

సెలవుల్లో.. శాశ్వత సెలవు

●ఇద్దరు చిన్నారులను మింగిన నీటి గుంత ● ప్రాణం తీసిన బాటిల్‌.. ● కుమురంభీం జిల్లా తాటిపల్లిలో ఘటన

కౌటాల: వేసవి సెలవుల నేపథ్యంలో గ్రామాల్లో పిల్లలంతా ఆటపాటలతో కాలక్షేపం చేస్తున్నారు. కొందరు స్వగ్రామంలో ఉండగా, కొందరు బంధువుల ఇళ్లకు వచ్చి.. ఇరుగు పొరుగు వారితో కలిసి ఆటలు ఆడుతున్నారు. ఈ క్రమంలో కుముంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం తాటిపల్లిలో కూడా శుక్రవారం ఆటలు ఆడుతూ వెళ్లిన ఇద్దరు చిన్నారులను నీటిగుంత మింగేసింది. దీంతో సెలవుల్లో.. శాశ్వత సెలవు తీసుకున్నారు.

కూలీ కుటుంబాలు..

తాటిపల్లి గ్రామానికి చెందిన బోయర్‌ విశ్వనాథ్‌, మనీష దంపతులు కష్టజీవులు. విశ్వనాథ్‌ వార్ధా నదిలో చేపలు పడుతుండగా, మనీష కూలీ పని చేస్తూ కొడుకు జయ్‌, కూతురు లక్ష్మి(13)ని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. లక్ష్మి 7వ తరగతి పూర్తి చేసింది. ఇక మహారాష్ట్రలోని ఎటపల్లి గ్రామానికి చెందిన షిండే విజయ్‌, రత్నమాల దంపతుల కుమార్తె హన్షిక (11) వేసవి సెలవుల సందర్భంగా తాటిపల్లిలోని తన అత్తమామలు వాగడే నిరుత, నీతేష్‌ ఇంటికి 12 రోజుల క్రితం వచ్చింది.

బలి తీసుకున్న బాటిల్‌..

వేసవి సెలవుల్లో లక్ష్మి, హన్షిక, కరిష్మా, నవ్య అనే నలుగురు బాలికలు తాటిపల్లి బీసీ కాలనీలో కలిసి ఆడుకుంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో చెంబుల్లో నీళ్లు తీసుకుని వ్యవసాయ భూములవైపు బహిర్భూమికి వెళ్లారు. అనంతరం ఆడుకుంటూ సమీపంలోని చెరువు కుంటలో తవ్విన లోతైన గుంత వద్దకు చేరుకున్నారు. కరిష్మా, నవ్య గుంత ఒడ్డున నిలబడగా లక్ష్మి, హన్షిక నీళ్లలో తేలుతున్న వాటర్‌ బాటిల్‌ తీయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో లక్ష్మి గుంతలో పడిపోగా ఆమెను రక్షించేందుకు హన్షిక చెయ్యి పట్టుకోవడంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు.

గుండెలు పగిలే రోదనలు

గుంత ఒడ్డున ఉన్న కరిష్మ, నవ్య వెంటనే కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు సమాచారం అందించా రు. వారు వచ్చి నీటిలో గాలించి లక్ష్మి, హన్షికలను బయటకు తీసినప్పటికీ అప్పటికే వారు మృతి చెందారు. పదమూడేళ్లకే నీకు నూరేళ్లు నిండాయా తల్లీ అంటూ లక్ష్మి తల్లిదండ్రులు ఆమె మృతదేహంపై ప డి విలపించారు. ఈ రోజు వద్దు, రేపు వెళ్తానన్నావు, బిడ్డా అంటూ హన్షిక అత్తమామలు గుండెలు బాదుకున్నారు. ఈ దృశ్యం అందరి కళ్లను చెమర్చింది.

పోలీసుల దర్యాప్తు

ఎస్సై విజయ్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. లక్ష్మి తల్లి మనీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాలను సిర్పూర్‌(టి)లోని ప్రభు త్వ ఆస్పత్రికి తరలించి, పోస్ట్‌మార్టం అనంతరం కు టుంబ సభ్యులకు అప్పగించారు. ఆసుపత్రి వద్ద హన్షిక తల్లిదండ్రులు ‘సెలవులకు వచ్చి శాశ్వతంగా సెలవు తీసుకున్నావా’ అంటూ బోరున విలపించా రు. ఈ ఘటనతో తాటిపల్లిలో విషాదం నెలకొంది.

సెలవుల్లో.. శాశ్వత సెలవు1
1/2

సెలవుల్లో.. శాశ్వత సెలవు

సెలవుల్లో.. శాశ్వత సెలవు2
2/2

సెలవుల్లో.. శాశ్వత సెలవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement