వేసవిలో జీవాలు పైలం
● మేత, దాణా సరిపడా అందించాలి
● జాగ్రతలు తప్పనిసరంటున్న పశువైద్యాధికారి సతీశ్
చెన్నూర్‌రూరల్: వేసవిలో పాడి పశువులు, జీవాల పోషణపై జాగ్రత్తలు తీసుకోవాలని కత్తెరసాల పశువైద్యాధికారి సతీశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాటల్లో.. పాడి పశువులకు వేసవిలో మేత, దాణాను సరిపడా అందించాలి. పచ్చిమేత దొరకని సమయంలో ఎండుమేత దీంతోపాటు ఎక్కువగా దాణాను ఇవ్వాలి. పశువులకు ఎల్లవేళలా పరిశుభ్రమైన చల్లని నీరు లభించేలా చూడాలి. మేత, నీరు సరిపడా ఉంటే పాడి పశువులు వేసవిలో కూడా పాలు బాగా ఇస్తాయి. ఎదకొచ్చి చూలు కడుతాయి. వేసవిలో పాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటే పాడి పరిశ్రమకు లాభదాయకం. దీనికోసం పశువుల షెడ్లు(కొట్టాల) వద్ద చల్లని వాతావరణం ఉండేలా చూడాలి. వీలైతే షెడ్డు(కొట్టాల)పై గడ్డిని కప్పి ఉంచాలి. షెడ్ల చుట్టూ తడికెలు, గోనె సంచులు కట్టి వాటిపై నీళ్లు చల్లాలి. పశువులపై మధ్యాహ్నం రెండు, మూడుసార్లు నీళ్లు చల్లితే మంచిది. గేదెలను చెరువులకు పంపి మధ్యాహ్నం కొంతసేపు అందులో ఉండనివ్వాలి. కొట్టాల చుట్టూ పెద్ద చెట్లు ఉంటే లోపల చల్లగా ఉంటుంది. ఈ పద్ధతుల్ని పాటిస్తే పాలు ఎక్కువగా ఉండటమే కాకుండా పశువులు ఎదకొచ్చి చూడి కడుతాయి. అలా అవి సంవత్సరం పొడవునా ఈని పాలిచ్చే అవకాశం ఉంటుంది. సాయంత్రం పాలు పితికే ముందు పశువును, పొదుగును చల్లని నీటితో కడిగితే మంచిది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వేసవిలో గొర్రెలు, మేకల్ని జత కలిపి చూడి కట్టించాలి. మూడు నెలల వయసు దాటిన పిల్లలను తల్లుల నుంచి వేరుచేయాలి. పిడుదులు, గోమార్లు లేకుండా మూడు వారాలకోసారి మందు కలిపిన నీటిలో గొర్రెలను తడిపి తీయాలి. అమ్మతల్లి(బొబ్బ, మశూచి) టీకాలు, చిటుక రోగం టీకాలను పిల్లలకు తప్పకుండా వేయించాలి. మధ్యాహ్నం పూట ఎండ వేడిమికి మేతకు బయట మేపకపోవడం మంచిది. బయట మేసే సమయంలో చెట్ల నీడ, తాగునీటి సదుపాయం ఉండేలా చూసుకోవాలి. నట్టల నివారణ మందులను పశువైద్యుడి సలహా మేరకు వినియోగించాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే వేసవిలో పశువులను, జీవాలను కాపాడుకోవచ్చు.
వేసవిలో జీవాలు పైలం


