
నకిలీ విత్తనాల విక్రయాలు అరికట్టాలి
● జిల్లా కలెక్టర్ బి.సంతోష్
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలతోపాటు ఎరువుల కృత్రిమ కొరతను అధికారులు సమన్వయంతో అరికట్టాలని జిల్లా కలెక్టర్ బి.సంతోష్ అన్నారు. మంగళవారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో నకిలీ విత్తనాల విక్రయం, ఎరువుల కృత్రిమ కొరత, ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తరలింపు అంశాలపై జిల్లా వ్యవసాయ అధికారి సురేఖతో కలిసి మండల వ్యవసాయ అధికారులు, ఏడీఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ధాన్యం తరలించకుండా చర్యలు తీసుకోవాలని, అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు, నదీ మార్గాన తరలింపు జరగకుండా తనిఖీలు చేపట్టాలని సూచించారు. సాగుకు అవసరమైన పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, జిల్లాలో 292 దుకాణాల ద్వారా విక్రయిస్తున్నారని, నిల్వలు, విక్రయ వివరాలు, కొనుగోలు చేసిన రైతుల వివరాలతో నివేదిక రూపొందించాలని, ప్రతీ దుకాణంలో నిల్వలు, ధరలతో కూడిన పట్టిక ప్రదర్శించాలని అన్నారు. నకిలీ విత్తనాల విక్రయాల నియంత్రణకు విక్రయదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. రైతులు సాగు చేస్తున్న విస్తీర్ణానికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులు పంపిణీ జరిగేలా చూడాలని తెలిపారు. అధిక దిగుబడి సాధనకు అవసరమైన సాగు మెలకువలను రైతులకు అందించాలని తెలిపారు.