ప్రభుత్వ ఉద్యోగులూ.. | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగులూ..

Apr 14 2024 8:15 AM | Updated on Apr 14 2024 8:15 AM

బహుపరాక్‌..! - Sakshi

బహుపరాక్‌..!

● రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉంటే కఠిన చర్యలే.. ● జిల్లా ఎన్నికల అధికారుల ప్రత్యేక దృష్టి ● ఉద్యోగ, ఉపాధ్యాయులు అప్రమత్తం..

నిర్మల్‌ఖిల్లా: పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌ తేదీలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలకుగానీ, పోటీలో ఉన్న అభ్యర్థులకుగానీ అనుకూలంగా వ్యాఖ్యలు చేసినా, సభలు సమావేశాల్లో పాల్గొన్నట్లు ఆధారాలున్నా కఠిన చర్యలు తీసుకోవడానికి ఎన్నికల కమిషన్‌, జిల్లా ఎన్నికల అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకుగాను ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులపై ఎన్నికల సర్వేలైన్స్‌ బృందాలు ప్రత్యేక నిఘా పెట్టాయి.

సిద్దిపేట జిల్లాలో 106 మందిపై వేటు..

ఇటీవల సిద్దిపేట జిల్లాలో ఓ రాజకీయ పారీక్టి చెందిన అభ్యర్థి నిర్వహించిన సమావేశానికి వెళ్లిన 106 మంది సెర్ప్‌, ఈజీఎస్‌ ఉద్యోగులపై ఎన్నికల అధికారి సస్పెన్షన్‌ వేటు వేశారు. ఎన్నికల ప్రవర్తన నియమాలని ఉల్లంఘించి ఒక రాజకీయ పార్టీ అభ్యర్థికి మద్దతుగా సమావేశానికి హాజరు కావడంతో ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ప్రత్యర్థి రాజకీయ పార్టీలవారు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎన్నికల నిఘా విభాగం అధికారులు ఆ సమావేశానికి హాజరైన ఉద్యోగుల వివరాలు సేకరించి సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయులువర్గాల్లో అలజడి మొదలైంది. ఎన్నికలవేళ ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని నిఘా బృందాలు సైతం ఉద్యోగ, ఉపాధ్యాయులపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో శాశ్వత, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులందరూ దాదాపు 45 వేల వరకు ఉంటారని అంచనా. వీరు రాజకీయ పార్టీలకు మద్దతుగా నిలిచినా లేదా ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఆయా పార్టీల సమావేశాలకు హాజరైనా, మద్దతుగా ప్రచారం నిర్వహించినా నిబంధనల మేరకు చర్యలు తీసుకునేలా అధికారులు నిఘా పటిష్టం చేశారు.

అప్రమత్తంగా ఉండాల్సిందే...

ప్రభుత్వ శాఖల ఉద్యోగులు లేదా ఉపాధ్యాయులు ఇతర కాంట్రాక్టు పొరుగు సేవల సిబ్బంది ఎన్నికల్లో పాల్గొనే రాజకీయ పార్టీలకు ప్రచారం చేయరాదనే నిబంధనలు 1949, సెప్టెంబర్‌ 17వ తేదీ నుంచి అమలులో ఉన్నాయి. ఈ చట్టంలోని సెక్షన్‌ 23 (ఐ) ప్రకారం వీరందరూ ఎన్నికల కోడ్‌ పరిధిలోకి వస్తారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు ఇతర అనుబంధ ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేసే అన్ని కేటగిరీలు, స్థాయిల్లోని ఉద్యోగులు, సిబ్బంది పారదర్శకంగా వ్యవహరించాల్సి ఉంటుందని నిబంధనలు తెలుపుతున్నాయి. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రతీ అధికారి ఉద్యోగి, సిబ్బంది తనవంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. ఎలాంటి పక్షపాత వైఖరిని ప్రదర్శించకూడదు. ప్రభుత్వం సూచించే ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరి వద్ద మొబైల్‌ ఫోన్‌ అందుబాటులో ఉంది. అయితే సోషల్‌ మీడియాలో హద్దులు మీది రాజకీయపక్షాలకు సంబంధించిన పోస్టులు పెట్టినా, పోటీలో ఉన్న అభ్యర్థులను కించపరిచేలా లేదా మద్దతుగా కామెంట్లు చేసినా తిప్పలు తప్పేలా లేవు. ఎన్నికల నిఘా బృందాలు, పోలీసులు, సైబర్‌ క్రైమ్‌ విభాగం అధికారుల సమన్వయంతో తీక్షణమైన నిఘాపెట్టి పరిశీలన చేస్తున్నారు. వ్యక్తిగత దూషణలు, రెచ్చగొట్టేలా మెసేజ్‌లు, ఫొటోలు, మార్ఫింగ్‌ వంటివి చేసినా కేసుల నమోదుతోపాటు ఉద్యోగం నుంచి సస్పెన్షన్‌ వేటువంటవి కూడా ఉండే అవకాశం ఉంది.

హద్దులు దాటితే అంతే..

● ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది రాజకీయ పార్టీల కండువాలు వేసుకుని ప్రచారం చేయడం లేదా ఎదుటి పార్టీలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం చేయకూడదు.

● ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థికి సహకరిస్తున్నారని ఏ చిన్న ఆధారం దొరికినా వేటు పడుతుంది.

● సామాజిక మాధ్యమాల్లోనూ ఒక పార్టీకో లేదా అభ్యర్థిగా వ్యతిరేకంగానో, సానుకూలంగానో పోస్టులు పెట్టినా చర్యలు ఉంటాయి.

● ఉన్నత స్థానంలో ఉన్న ప్రభుత్వ అధికారి తన కిందిస్థాయి సిబ్బందికి అధికార దర్పంతో ఒక పార్టీకి లేదా ఫలానా అభ్యర్థికి మద్దతు తెలపాలని, సహకరించాలని సూచించకూడదు.

కంట్రోల్‌రూమ్‌ సిబ్బందికి సూచనలు చేస్తున్న నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌(ఫైల్‌)

ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఎన్నికల విధులు నిర్వహించనున్న ఉద్యోగులు..

నిర్మల్‌ 1,554

ఖానాపూర్‌ 1,555

ముధోల్‌ 1,584

బోథ్‌ 1,472

ఆదిలాబాద్‌ 1,412

ఆసిఫాబాద్‌ 1,480

సిర్పూర్‌ 1,432

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement