
ఉపాధివేటలో యువకుడు మృతి
నిర్మల్‌ఖిల్లా: ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు తరలివెళ్లిన జిల్లా వలస కార్మికుడు అక్కడే అసువులు బాశాడు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని కుప్టి గ్రామానికి చెందిన బోయిడి రాజు (27) అనే యువకుడు ఉపాధి నిమిత్తం గతేడాది జోర్డాన్ దేశానికి వెళ్లాడు. అక్కడ క్లాసిక్ ఫ్యాషన్స్ కంపెనీలో క్లీనర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గత మంగళవారం పనులు చేస్తున్న సమయంలో మూడో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు అక్కడి వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కాగా మృతుడి తండ్రి ఎర్రన్న బుధవారం జిల్లా కేంద్రంలోని రాష్ట్ర ఎన్నారై సలహా కమిటీ సభ్యుడు స్వదేశ్ పరికిపండ్లకు విషయం తెలిపారు. సాధారణ పరిపాలన శాఖ ద్వారా జోర్డాన్ దేశంలోని భారత రాయబార కార్యాలయానికి వివరాలను అందజేసి అక్కడి కంపెనీ అధికారులతో మాట్లాడి మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్వదేశ్ పరికిపండ్ల పేర్కొన్నారు.