వైద్యం వికటించి యువకుడి మృతి! | - | Sakshi
Sakshi News home page

వైద్యం వికటించి యువకుడి మృతి!

Oct 16 2025 6:14 AM | Updated on Oct 16 2025 6:14 AM

వైద్య

వైద్యం వికటించి యువకుడి మృతి!

బెల్లంపల్లి: జ్వరంతో బాధపడుతున్న తాండూర్‌ మండలానికి చెందిన ఓ యువకుడు ఆర్‌ఎంపీ చేసిన వైద్యం వికటించి మృతి చెందినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మండలంలోని ద్వారకాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి గత నెలలో జ్వరం రాగా చికిత్స కోసం ఓ ఆర్‌ఎంపీని ఆశ్రయించాడు. సదరు ఆర్‌ఎంపీ రెండు ఇంజక్షన్‌లు ఇచ్చి, సైలెన్‌ పెట్టాడు. దీంతో సదరు యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లగా చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. గతనెల 27న ఈ ఘటన జరగ్గా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డట్లు తెలుస్తోంది. తాజాగా వైద్యం వికటించి యువకుడు మృతి చెందినట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదని సమాచారం.

కరెంట్‌ షాక్‌తో వ్యక్తి మృతి

నిర్మల్‌టౌన్‌: జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి కరెంట్‌ షాక్‌తో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పట్టణ సీఐ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఈద్గాంకు చెందిన జానా రమేశ్‌ (40) తన అన్న పాత ఇంటి పక్కన మరో కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టాడు. దీంతో కొత్త ఇల్లుకు పాత ఇంటి నుంచి కరెంట్‌ కనెక్షన్‌ ఇచ్చారు. ఈక్రమంలో రమేశ్‌ తెలియక కరెంట్‌ వైర్‌ను ముట్టుకోవడంతో షాక్‌ కొట్టి కిందపడిపోయాడు. వెంటనే అక్కడ పనిచేసే వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రమేశ్‌కు భార్య, కొడుకు ఉన్నారు. వీరు గత పది సంవత్సరాల నుంచి రమేశ్‌కు దూరంగా ఉంటున్నారు. రమేశ్‌ అన్న మహేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ పేర్కొన్నారు.

చికిత్స పొందుతూ కౌలు రైతు మృతి

నెన్నెల: అప్పుల బాధతో ఆత్మహత్యాయత్నం చేసిన కౌలు రౌతు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. ఎస్సై ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గంగారాం గ్రామానికి చెందిన కౌలు రైతు కడారి బక్కన్న(40) మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. పెట్టుబడి కోసం రూ.2 లక్షలు వరకు అప్పు చేశాడు. అధిక వర్షాలతో పంట నష్టపోగా అప్పులు ఎలా తీర్చాలో తెలియలేదు. దీంతో ఈ నెల 3న ఇంటి వద్ద గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి అక్కడి నుంచి వరంగల్‌కు తరలించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. అతని భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

పాముకాటుతో మహిళ మృతి

దహెగాం: మండల కేంద్రానికి చెందిన దాసరి ఆద్యశ్రీ (స్రవంతి(22)) అనే మహిళ పాము కాటుకు గురై మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం భర్త శ్రావణ్‌తో కలిసి స్రవంతి వ్యవసాయ పనులకు వెళ్లింది. వ్యవసాయ పనులు చేసుకుంటున్న సమయంలో దాహం వేయడంతో పొలంలో ఉన్న మోటర్‌ వద్దకు వెళ్లగా పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే మృతి చెందింది.

ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి

సారంగపూర్‌: మండల కేంద్రానికి చెందిన దేవి సాయమ్మ(80) అనే వృద్ధురాలు బుధవారం ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని మృతిచెందింది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల బస్సు సాయంత్రం పిల్లలను దింపేందుకు ఎస్సీకాలనీకి వెళ్లింది. బస్సు డ్రైవర్‌ జాదవ్‌ అంకుష్‌ విద్యార్థులను దింపేసి తిరిగి బస్సును రివర్స్‌ చేసే క్రమంలో ఇంటి ముందు నిలబడి ఉన్న వృద్ధురాలిని ఢీకొట్టాడు. ప్రమాదంలో దేవి సాయమ్మకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు సాయమ్మను నిర్మల్‌ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈమేరకు బస్సుడ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

వైద్యం వికటించి యువకుడి మృతి!1
1/1

వైద్యం వికటించి యువకుడి మృతి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement