చెక్‌బౌన్స్ కేసులో ఒకరికి ఏడాది జైలు
బెల్లంపల్లి: చెక్‌బౌన్స్ కేసులో ఓ నిందితుడికి బుధవారం ఏడాది జైలుశిక్ష పడింది. బెల్లంపల్లి వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో కె.శ్రీనివాస రావు తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లి ఫుట్‌బాల్ గ్రౌండ్ బస్తీకి చెందిన రత్నం రాజం అనే వ్యక్తి వద్ద 2019లో అదే బస్తీకి చెందిన బోగే మోహన్ రూ.3.5 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఈమేరకు మోహన్ తనకు చెందిన చెక్‌ను రాజంకు ఇచ్చాడు. చెక్‌ను రాజం బ్యాంక్‌లో డిపాజిట్ చేయగా ఖాతాలో నగదు లేక చెక్ బౌన్స్ అయ్యింది. బాధితుడు రాజం కోర్టులో కేసు వేయగా విచారించిన బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జె.ముఖేశ్ నేరం రుజువు కావడంతో బుధవారం బోగే మోహన్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
బైక్‌లో నుంచి నగదు చోరీ
కాగజ్‌నగర్‌టౌన్: బైక్‌లో ఉంచిన నగదును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. కాగజ్‌నగర్ మండలంలోని ఆరెగూడ గ్రామానికి చెందిన బీమన్‌కార్ ఇస్తారి తన కుమారుడు బీమన్‌కార్ బబ్లుతో కలిసి పట్టణంలోని తెలంగాణ గ్రామీణబ్యాంక్‌లో రూ.2.25 లక్షలు డ్రా చేసుకున్నారు. డ్రా చేసుకున్న డబ్బులను బైక్‌లో పెట్టుకొని కాగజ్‌నగర్ తహసీల్దార్ కార్యాలయానికి సర్టిఫికెట్ కోసం వెళ్లారు. బబ్లు బైక్‌ను కార్యాలయ ఆవరణలో నిలిపి కార్యాలయం లోనికి వెళ్లాడు. ఇస్తారి బైక్‌కు కొంచెం దూరంగా ఉండడాన్ని గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌లో ఉన్న నగదు ఎత్తుకెళ్లారు. చుట్టుపక్కల వారిని అడిగినా తెలియదని చెప్పడంతో చేసేదేం లేక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తగ్గిన డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజులు
లక్ష్మణచాంద: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ప్రథమ సంవత్సరం మొదటి సెమిస్టర్ విద్యార్థులకు పెంచిన పరీక్ష ఫీజులను అధికారులు తగ్గించారు. ఇటీవల మొదటి సెమిస్టర్ విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ.3250గా నిర్ణయించారు. దీంతో మధ్యతరగతి విద్యార్థులు పెంచిన ఫీజులు కట్టలేమని వాపోయారు. వారి ఇబ్బందులపై ‘సాక్షి’లో ఈ నెల 10న ‘మోయలేని భారం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు పరీక్ష ఫీజులు తగ్గించి గత సంవత్సరం ఫీజులు చెల్లించాలని విద్యార్థులకు సూచించారు. బీఏ ఫస్ట్ సెమిస్టర్ విద్యార్థులు రూ.1440, బీఎస్సీ, బీకాం విద్యార్థులు రూ.1640 చెల్లించాలని నిర్ణయించారు.
ఇంద్రాదేవి ఆలయంలో గుస్సాడీల పూజలు
ఇంద్రవెల్లి: మండలకేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయంలో బుధవారం సిరికొండ మండలం నేరడిగొండ గ్రామానికి చెందిన గుస్సాడీలు, దండారీ బృందం ఆదివాసీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యాలు సమర్పించి ఇంద్రాదేవికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గుస్సాడీలు చేసిన నృత్యం, యువకులు చేసిన కోలాటం ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం జన్నారం మండలంలోని గుడిరేవు పద్మల్‌పూరి కాకో ఆలయానికి బయల్దేరి వెళ్లారు. ఇందులో గ్రామపెద్దలు ఉన్నారు.
ఎఫెక్ట్..