
‘సమస్యల పరిష్కారంలో గెలిచిన సంఘాలు విఫలం’
శ్రీరాంపూర్: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన కార్మిక సంఘాలు కార్మికుల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన ఎస్‌ఆర్పీ1 గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్‌లో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణి కంపెనీకి రావాల్సిన రూ.42 వేల కోట్ల బకాయిలు ఇప్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. తక్కువ లాభాలు చూపి వాటా పంపిణీ చేసి కార్మికులకు అన్యాయం చేశారన్నారు. సింగరేణిలో మెడికల్ బోర్డు ఎత్తివేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, దీనిపై అన్ని కార్మిక సంఘాలు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఆ యూనియన్ బ్రాంచ్ అధ్యక్షుడు గుల్ల బాలాజీ, రాష్ట్ర కమిటీ సభ్యుడు కస్తూరి చంద్రశేఖర్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంగళ శ్రీనివాస్, నాయకులు వెంకటరెడ్డి, గోపాల్ సింగ్, రాథోడ్ పాల్గొన్నారు.