వెల్దండ(ఊర్కొండ): ఊర్కొండపేట శివారులోని బావిలో ఈతకు వెళ్లిన యువకుడు నీటిలో మునిగి మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదర్‌పల్లికి చెందిన కాలే అనిల్(20) ఊర్కొండపేటలోని తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తున్నాడు. శనివారం మధ్యాహ్న సమయంలో గ్రామశివారులోని బావిలో తన సోదరుడు, స్నేహితులతో కలసి ఈతకు వెళ్లాడు. అప్పటివరకు సరదాగా స్నేహితులతో కలసి ఈతకొట్టిన అనిల్ ఒక్కసారిగా కనిపించలేదు. స్నేహితుడు కనిపించడంలేదని గుర్తించిన వారు బావిలో వేతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ ఆఫీసర్ చంద్రశేఖర్, సిబ్బంది శ్రీనివాస్, చంద్రశేఖర్, గణేష్, రాహుల్, తిరుపతయ్య, సంతోష్ బావిలో గాలింపు చేపట్టారు. మృతదేహం లభించడంతో ఫైర్ సిబ్బంది సీపీఆర్ చేసినా అప్పటికే యువకుడు మృతిచెందినట్లు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. చేతికందిన కుమారుడు మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. మృతుడికి తల్లిదండ్రులు అరుణమ్మ, కృష్ణయ్య ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కృష్ణదేవ తెలిపారు.


