జడ్చర్ల: రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్‌ఐ రాజు తెలిపారు. జడ్చర్ల–దివిటిపల్లి మధ్య పట్టాలపై శుక్రవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి (48) రైలు కింద పడి మృతి చెందినట్లు గుర్తించామన్నారు. రైలు పట్టాలు దాటుతున్న సమయంలో మరణించాడా లేక ఆత్మహత్య చేసుకున్నడా అన్న కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు. మృతుడు తెలుపు రంగు చొక్క, బ్లూ కలర్ లుంగి ధరించి ఉన్నాడని ఆచూకీ తెలిసిన వారు 87126 58597 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మల్దకల్: శ్రీరంగాపురం మండలంలోని జానంపేటకు చెందిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన విష్ణువర్దన్ సాగర్ (38) ఈనెల 8న అయిజలో జరిగే వివాహానికి హజరయ్యేందుకు వెళ్తుండగా మల్దకల్ మండలం అమరవాయి–బూడిదపాడు గ్రామ సమీపంలో బైకు అదుపుతప్పి గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు కర్నూలు ఆస్పత్రికి అనంతరం ఈనెల 12న హైదరాబాద్‌కు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య అనితతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బస్‌స్టాప్‌లో యాచకుడి మృతి
భూత్పూర్: పట్టణంలో అమిస్తాపూర్ సమీపంలోని రాజీవ్ స్వగృహ ఎదుట గల బస్‌స్టాప్‌లో ఓ యాచకుడు (56) మృతి చెందినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు గుర్తు తెలియని వ్యక్తి గత కొన్ని రోజులుగా రాజీవ్ స్వగృహ చుట్టుపక్కల భిక్షాటన చేసుకుంటూ జీవించేవాడు. శుక్రవారం ఉదయం రాజీవ్ స్వగృహకు చెందిన కాలనీ వాసులు వాకింగ్ చేస్తుండగా బస్టాండ్‌లో మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలాన్ని పరిశీలించిన పోలీసులు ఎండ తీవ్రత తట్టుకోలేక నిద్రిస్తున్న చోటనే మరణించి ఉండొచ్చని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఎవరికై నా ఆచూకీ తెలిస్తే భూత్పూర్ పోలీసులను సంప్రదించాలని ఎస్‌ఐ తెలిపారు.


