జడ్చర్ల: జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారుల బృందం శుక్రవారం ఆకస్మిక దాడులు చేశారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ మహబూబ్‌నగర్ రేంజ్ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో పది మంది సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ కమిషర్ లక్ష్మారెడ్డి తన చాంబర్‌లోనే ఉండగా.. మిగతా సిబ్బంది ఎవరి పనుల్లో వారు నిమ్మగ్నమవ్వగా.. మధ్యాహ్నం 12:30గంటల ప్రాంతంలో ఏసీబీ అధికారుల బృందం కార్యాలయంలోకి ప్రవేశించింది. సిబ్బంది మొబైల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయంలో వివిధ పనులకు సంబంధించి వచ్చిన వారిని విచారించి, వారిని సోదా చేసి బయటకు పంపారు.
నగదు స్వాధీనం
మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసిన సందర్భంగా కమిషనర్, సిబ్బంది వద్ద ఎలాంటి నగదు లభించనట్లు తెలిసింది. అయితే అక్కడకు వచ్చిన వారిలో మున్సిపల్ కాంట్రాక్టు పనులు చేసే జావీద్ వద్ద రూ.48 వేలు, కృష్ణారెడ్డి వద్ద రూ.15వేలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మరి కొందరి వద్ద కూడా ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు.
● కార్యాలయంలో అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్, ఎల్‌ఆర్‌ఎస్, శానిటేషన్, రెవెన్యూ, ఇంజినీరింగ్ తదితర విభాగాలపై దృష్టి సారించి ఆ దిశగా విచారించారు. భవన నిర్మాణ అనుమతుల్లో అవకతకవకలు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, పన్నుల రూపేనా వచ్చిన ఆదాయంపై విచారించారు. ఇందుకు సంబంధించి అనుమానాస్పదంగా ఉన్న పలు రికార్డులను సీజ్ చేయగా మరికొన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా.. అధికారులు, సిబ్బందికి సంబంధించిన ఆన్‌లైన్ లావాదేవీలను కూడా పరిశీలించనున్నట్లు సమాచారం. వారి ఫోన్లను స్వాధీన పర్చుకున్న తరువాత ఫోన్ పే, గూగుల్ పే ఖాతాలను పరిశీలించి అధిక మొత్తంలో అనుమానాలు వచ్చిన వారి బ్యాంకు ఖాతాలను కూడా నిశితంగా పరిశీలించనున్నట్లు సమాచారం.
అంతులేని అవినీతి
జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో అంతులేని అవినీతి పెరిగిందని, ఈ ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి ఖర్చు చేసిన నిధులు, భవన నిర్మాణ అనుమతులు, పన్నుల వసూళ్లు తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపితే అసలు గుట్టు రట్టవుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. మున్సిపల్ పరిధిలో వెంచర్లు, అపార్ట్‌మెంట్‌ల మార్టిగేజ్ రిలీజ్‌పై కూడా ఏసీబీ నజర్ పెట్టే పరిస్థితి ఉంది. అంతేగాక నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుల అంతుస్థుల భవనాలకు సంబంధించి భారీగా అవినీతి జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. చాలాచోట్ల సెల్లార్లకు అనుమతులు లేకున్నా అక్రమంగా డబ్బులు ముట్టజెప్పి సెల్లార్లు నిర్మించారు. ఇక రోడ్ల మరమ్మతుల పేరిట భారీగా అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు ఉన్నాయి.
ఒక్కసారిగా కలకలం
మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారన్న సమాచారంతో పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేపింది. గతంలో నగర పంచాయతీ, మేజర్ జీపీగా ఉన్న కాలంలో సైతం అవినీతి యథేచ్ఛగా సాగుతున్నా ఏసీబీ అధికారులు ఏనాడు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. అయితే పాలకమండలి పదవీకాలం ముగిసిన వారం రోజులకే ఏసీబీ దాడులకు దిగడం చర్చనీయాంశగా మారింది.
ఫిర్యాదుల ఆధారంగానే తనిఖీలు: ఏసీబీ డీఎస్పీ
మున్సిపల్ కార్యాలయంలో అవినీతిపై తమకు అనేక ఫిర్యాదులు రావడంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ తెలిపారు. మున్సిపల్‌లోని ఇంజినీరింగ్, రెవెన్యూ, శానిటేషన్ తదితర విభాగాలకు సంబంధించి రికార్డులను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. అవకతవకలు తేలితే సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామన్నారు. అధికారులు, ఉద్యోగులు పనులకు సంబంధించి ప్రజలనుంచి లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు. తనిఖీలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు
సిబ్బంది మొబైల్ ఫోన్లు, నగదు స్వాధీనం
పలు రికార్డుల సీజ్, స్వాధీనం
అవినీతి ఆరోపణ నేపథ్యంలోనే దాడులు..


