రైతాంగాన్ని విస్మరించిన కాంగ్రెస్‌ | - | Sakshi
Sakshi News home page

రైతాంగాన్ని విస్మరించిన కాంగ్రెస్‌

May 16 2026 1:03 AM | Updated on May 16 2026 1:03 AM

మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: లేనిపోని హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పనులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయని.. ఈ ప్రభుత్వం రైతాంగాన్ని విస్మరించిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. 10 లక్షల ఎకరాలకు సాగునీరందించే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు బీఆర్‌ఎస్‌ హయాంలోనే 90 శాతం పూర్తయ్యాయని.. మిగిలిన పది శాతం పనులను పూర్తి చేయడంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని దుయ్యబట్టారు. మహబూబ్‌నగర్‌లోని తన నివాసంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్లలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. తగినన్ని కేంద్రాలు, సంచులు, లారీలు ఏర్పాటు చేయకుండా.. మద్దతు ధర చెల్లించకుండా, తరుగు పేరుతో దోపిడీ చేస్తుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతాంగం శ్రేయస్సు, పాలమూరు ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలనే డిమాండ్‌తో నారా్ల్పూర్‌ నుంచి ఉదండాపూర్‌ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్సీలు నవీన్‌ కుమార్‌రెడ్డి, సురభి వాణీదేవి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్‌, మర్రి జనార్దన్‌రెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి, ఆంజనేయులు గౌడ్‌, ఇంతియాజ్‌, వాల్యనాయక్‌, హనుమంతు నాయుడు, రాజేశ్వర్‌గౌడ్‌, నర్సింహులు పాల్గొన్నారు.

ఒక్క ప్రాజెక్ట్‌ పూర్తి చేశారా.. : నిరంజన్‌రెడ్డి

గతంలో తెలంగాణలో యాసంగిలో ఐదారు లక్షల ఎకరాలే సాగయ్యేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అదే యాసంగిలో బీఆర్‌ఎస్‌ హయాంలో 59.44 లక్షల ఎకరాలు సాగైందని ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి. మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం వంటి పథకాలు ఇందుకు దోహదం చేశాయి. నీళ్లు ఇవ్వకుంటే అంత సాగు సాధ్యమయ్యేదా? 2023లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఏమైనా సాగు పెరిగిందా? అదనంగా సాగు నీరు ఇచ్చే ఒక్క ప్రాజెక్ట్‌ పూర్తి చేశారా? పాలమూరు ప్రాజెక్ట్‌లపై ఇప్పటికై నా ముఖ్యమంత్రి సమీక్ష చేయాలి. ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రతిపక్ష పార్టీ నాయకుల అభిప్రాయం తీసుకోవాలి. యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రవాణా కోసం నిర్వహించిన టెండర్లలో పెద్ద స్కాం జరిగిందని విమర్శించారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం: లక్ష్మారెడ్డి

పాలమూరు ప్రాజెక్ట్‌ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. కాంగ్రెస్‌ వాళ్లు కేసులు వేసి పాలమూరు ప్రాజెక్ట్‌ ఆపాలని చూసినా 90 శాతం పనులు పూర్తి చేశాం. నార్లాపూర్‌లో కేసీఆర్‌ ఒక పంప్‌ ప్రారంభించారు.. మేము తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే ఐదు నెలల్లో పూర్తి చేసేవాళ్లం.

Advertisement
 
Advertisement
Advertisement