‘హైలెవల్‌’.. ముమ్మరం | - | Sakshi
Sakshi News home page

‘హైలెవల్‌’.. ముమ్మరం

May 15 2026 12:07 PM | Updated on May 15 2026 12:07 PM

ఆత్మకూర్‌: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువన హైలెవల్‌ వంతెన నిర్మాణానికి ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజల కల సాకారం కాబోతుంది. వంతెన పనులు ప్రారంభం కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వంతెన నిర్మాణంతో గద్వాల, ఆత్మకూర్‌ ప్రాంతాల మధ్య దూరం తగ్గనుంది. జూరాల, కొత్తపల్లి గ్రామాల మధ్య కృష్ణానదిలో భారీ పిల్లర్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇదివరకే తాత్కాలిక రహదారి ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఆత్మకూర్‌ మండలం జూరాల గ్రామం వద్ద రూ.123 కోట్లతో వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతేడాది డిసెంబర్‌ 1న శంకుస్థాపన చేయగా.. వెంటనే తాత్కాలిక రహదారి నిర్మాణ చేపట్టి వినియోగంలోకి తీసుకొచ్చారు.

తగ్గనున్న దూరం..

ఆత్మకూర్‌ నుంచి జూరాల మీదుగా గద్వాలకు వెళ్లేందుకు 32 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంది. గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్‌ మండలం జూరాల గ్రామం వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మిస్తే కేవలం పది కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 22 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ప్రస్తుతం నిర్మించిన తాత్కాలిక రహదారిపై ప్రయాణిస్తున్న రెండు జిల్లాల ప్రయాణికులు దూరభారం తగ్గడంతో సమయంతో పాటు డబ్బులు ఆదా అవుతున్నాయని అంటున్నారు. అలాగే గద్వాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలంటే ఎర్రవల్లి చౌరస్తా మీదుగా హైవే మీద ప్రయాణం చేయాల్సి ఉంది. వంతెన నిర్మాణం పూర్తయితే గద్వాల నుంచి ఆత్మకూర్‌ మీదుగా తక్కువ వ్యవధిలో కొత్తకోట హైవేకు చేరుకోవచ్చు. దీంతో 40 కిలోమీటర్ల దూరం తగ్గనున్నట్లు అంచనాలు ఉన్నాయి. అలాగే ఎమ్మిగనూరు, ఆదోని, బళ్లారి, మంత్రాలయం వెళ్లే వారికి దూరం తగ్గే అవకాశం ఉంది. వ్యాపార పరంగా ఆత్మకూర్‌, జూరాల, కొత్తపల్లి ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి.

18 నెలల్లో పూర్తి...

జూరాల, కొత్తపల్లి మధ్యన కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.123 కోట్లు కేటాయించింది. దీంతో ఆర్‌అండ్‌బీశాఖ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ పూర్తిచేశారు. ముఖ్యమంత్రి పనులను లాంఛనంగా ప్రారంభించగా.. మంత్రి వాకిటి శ్రీహరి త్వరితగతిన పూర్తిచేసే విధంగా కాంట్రాక్టు కంపెనీ, ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడుతున్నారు. మొత్తం 18 పిల్లర్లతో ఏడాదిన్నరలోగా పనులు పూర్తిచేసే విధంగా పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు పేర్కొంటున్నారు.

రూ.123 కోట్లతో వంతెన నిర్మాణం

జూరాల– కొత్తపల్లి మధ్య కృష్ణానదిలో కొనసాగుతున్న పిల్లర్ల పనులు

తాత్కాలిక రహదారిపై వాహనాల రాకపోకలు

Advertisement
 
Advertisement
Advertisement