స్టేషన్ మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలో పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని పిల్లలమర్రిలో పలు అభివృద్ధి పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా సుమారు రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయగా అందులో భాగంగా రూ.2.5 కోట్ల వ్యయంతో పలు పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. మయూరీ పార్క్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ట్రెక్కింగ్ ట్రైల్స్, వ్యూ పాయింట్లు, టూరిస్టుల కోసం తాత్కాలిక కాటేజీల ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఫారెస్ట్ ఏరియా పరిమితులను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు జరుగుతాయని తెలిపారు. కురుమూర్తి, మన్యంకొండ, పిల్లలమర్రి వంటి ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2028లో నిర్వహించనున్న కృష్ణా పుష్కరాల దృష్ట్యా జిల్లాలోని పురాతన దేవాలయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సుమారు 150 పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పించినట్లు చెప్పారు. సీఎం వాటిని ఆమోదిస్తూ ప్రధాన దేవాలయాలన్నింటిని అభివృద్ధి చేయాలని సూచించినట్లు వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఖుష్భూ గుప్తా, మేయర్ గుమ్మాల మమత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కార్పొరేటర్ దేవ్లీ మేఘ్యనాయక్, జిల్లా పర్యాటక అధికారి రాజశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సిరాజ్‌ఖాద్రీ, ప్రశాంత్, రమేష్‌రెడ్డి, తిరుమల వెంకటేశ్, రవి, అశ్వాక్, హకీం, రాజు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి


