● నేటితో ముగియనున్న ఆప్షన్ల స్వీకరణ
● బదిలీల ప్రక్రియ పారదర్శకంగాఉంటుంది: డీపీఓ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లాలో మొత్త 423 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 శాతానికి మించి బదిలీలు చేయడానికి వీలులేదు. దీంతో 151 మంది పంచాయతీ కార్యదర్శుల బదిలీలు కానున్నాయి. బదిలీలపై ఉద్యోగుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులతో బుధవారం జిల్లా పంచాయతీ అఽధికారి వెంకట్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. కార్యదర్శుల బదిలీలు పారదర్శకంగా చేపడుతామని వారికి హామీ ఇచ్చారు. జీఓ 38 ప్రకారం నాలుగేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న కార్యదర్శులు, ఇతర ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. 40 శాతం మంది ఉద్యోగులకు బదిలీల్లో పరిగణలోకి తీసుకుంటారు. రిటైర్మెంట్ ఉన్న ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. మిగిలిన వానిరి కౌన్సెలింగ్ ద్వారా బదిలీ ప్రక్రియ చేపడుతారు. ఇప్పటికే ఉద్యోగుల సీనియారిటీ జాబితా సిద్ధం చేశారు. దీనికి ప్రకారం ఈనెల 15వ తేదీ వరకు ఉద్యోగులు తాము కోరుకునే స్థానాలను ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తును పరిశీలిస్తారు. ఈనెల 25వ తేదీ నుంచి బదిలీల ఉత్తర్వులు జారీ చేస్తారు.


