●
కొనుగోలు కేంద్రం ఉంటేనే మాకు గిట్టుబాటు
మేము ప్రాణాలకు తెగించి చేపలు పడుతున్నాం. కానీ దళారుల వల్ల ఆశించిన లాభం రావడం లేదు. గోపన్‌పేట వద్దే ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారిక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే, మాకు సరైన ధర దక్కుతుంది. రవాణా ఖర్చులు కూడా మిగులుతాయి. మంత్రి వాకిటి శ్రీహరి దీనిపై చొరువ తీసుకోవాలి. – వెంకట్‌స్వామి, రామన్‌పాడు,
మత్స్యకారుడు
కోల్డ్ స్టోరేజ్ సదుపాయం కల్పించాలి
చేపలు పట్టిన వెంటనే విక్రయించకపోతే పాడయ్యే అవకాశం ఉంది. జలాశయం సమీపంలో చిన్నపాటి కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ లేదా ఐస్ ఫ్యాక్టరీ అందుబాటులోకి తెస్తే, వేట ముగిశాక చేపలు నిల్వ చేసుకునే వీలుంటుంది. మార్కెట్ సౌకర్యం పెంచితే రామన్‌పాడు చేపలు తెలంగాణ వ్యాప్తంగా బ్రాండ్‌గా మారుతాయి. – ఆంజనేయులు,
మత్స్యకార సంఘం సభ్యుడు
మదనాపురం: అది కేవలం జలాశయం మాత్రమే కాదు.. వేల కుటుంబాల ఆశల దీపం. తెల్లవారుజామున అలల సవ్వడితో పాటు మత్స్యకారులు వలలు విసిరిన చప్పుడు అక్కడ నిత్యకృత్యం. మండలంలోని రామన్‌పాడు జలాశయం ఇప్పుడు మత్స్య సంపదకు కేరాఫ్ అడ్రస్. రామన్‌పాడులో చేపల వృద్ధి మూడు రకాలుగా జరుగుతుంది. ఏటా సుమారు 3 లక్షల చేప పిల్లలను అధికారులు ఈ జలాశయంలో వదులుతారు. దీంతో పాటు వర్షాకాలంలో ఊకచెట్టు వాగు, సరళాసాగర్ దిగువ ప్రాంతాల నుంచి వరద నీటితో పాటు సహజ సిద్ధంగా చేప పిల్లలు వచ్చి చేరుతాయి. జూరాల ఎడమ, కుడి కాల్వల ద్వారా వచ్చే ప్రవాహం ప్రాజెక్టులోకి నిరంతరం కొత్త రకం చేపలను మోసుకొస్తుంది.
వేల కుటుంబాలకు జీవన ధార
రామన్‌పాడు రిజర్వాయర్ నమ్ముకుని కేవలం చేపలు పట్టడమే కాకుండా.. అనుబంధ రంగాల ద్వారా 2 వేల పైచిలుకు కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఆత్మకూరు, అజ్జకొల్లు, రామన్‌పాడు, బాలకిష్టాపురం, గోపన్‌పేట, కరివెన గ్రామాల మత్స్యకారులు పగలు, రాత్రి తేడా లేకుండా అలలపై పోరాటం చేస్తూ.. జీవనోపాధి పొందుతున్నారు.
చేపల ప్రత్యేకత
ఇక్కడి చేపలకు మార్కెట్‌లో డిమాండ్ భారీగా ఉంటుంది. కాల్వలు, వాగులు, కృష్ణానది నుంచి వచ్చే స్వచ్ఛమైన ప్రవహించే నీటిలో పెరగడం వల్ల ఈ చేపలు చాలా రుచిగా ఉంటాయి. ఎటువంటి కృత్రిమ మేత లేకుండా సహజ సిద్ధమైన నాచు, పురుగులను తిని పెరగడం వల్ల వీటికి పోషక విలువలు ఎక్కువ. బొచ్చె, రాహు, మోసు వంటి రకాలతో పాటు స్థానిక వాగు చేపలు ఇక్కడ ప్రత్యేకం.
రామన్‌పాడులో జల పుష్పాలు.. మత్స్యకారుల ఇంట కాసుల పంట
కృష్ణమ్మ వరదతో వచ్చే కొత్త రకం చేపలు
సహజ సిద్ధమైన నాచు,పురుగులే ఆహారం
మార్కెట్‌లో భారీ డిమాండ్


