నారాయణపేట: ప్రజల సొమ్ము దోచుకోనేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలను ప్రయోగిస్తున్నారని, మోసపూరిత వాగ్ధానాలు, ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్న మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీముల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డాక్టర్ వినీత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గొలుసుకట్టు వ్యాపారాలు చేస్తూ ప్రజలను మోసం చేసే మల్టీలెవెల్ వ్యాపారాలు పెరిగిపోతున్నాయన్నారు. ఏజెంట్లను చేర్పిస్తే రివార్డులు, పాయింట్లు లభిస్తాయని కేటుగాళ్లు ఆశ చూపుతారని, ఇలాంటి వారి మాయమాటలు నమ్మి అత్యాశకు పోతే భారీగా ఆర్థిక నష్టం తప్పదన్నారు. గొలుసుకట్టు వ్యాపారాల పేరుతో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటనలు చేసి అమాయకులను ఆకర్షించి తర్వాత మోసం చేసి జెండా ఎత్తేస్తారన్నారు. అతి తక్కువ కాలంలో అధిక లాభాలు వస్తాయని ఎవరైనా చెప్తే అది మోసమని గ్రహించాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ప్రకటన పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి, అనుమానాస్పద ప్రకటనలు, వెబ్ లింకులు, ఏపీకె ఫైల్స్ లాంటివి డౌన్లోడ్ చేసి మోసపోవద్దన్నారు. మోసపూరిత ప్రకటనలపై, ఆర్థిక మోసాలపై సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.


