గట్టు : మండల పరిధిలోని ఇందువాసి గ్రామంలో బుధవారం ఉపాధిహామీ పనులకు వెళ్లిన కూలీ తోలు తిమ్మప్ప (55) గుండెపోటుతో మృతి చెందాడు. రోజు వారిగా తోటి కూలీలతో కలసి తోలు తిమ్మప్ప గ్రామ శివారులోని గంగంబావి కుంట వద్ద పనులకు వెళ్లాడు. ముఖ హాజరు తీసుకుంటున్న క్రమంలో ఉన్నట్టుండి కుప్పకూలిపోవడంతో తోటి కూలీలు హుటాహుటిన గ్రామంలోని వైద్యుని దగ్గరకు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలిపారు. ఈ ఘటనతో తిమ్మప్ప కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ చెన్నయ్య, ఏపీఓ స్వాములు, ఫీల్డ్ అసిస్టెంట్ షణ్ముకం తదితరులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
బావిలో పడి వృద్ధుడు మృతి
కొల్లాపూర్: పట్టణంలోని చుక్కాయిపల్లి కాలనీకి చెందిన గొర్ల నర్సింహ(62) ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన నర్సింహ రాత్రి వరకు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ తెలియలేదు. బుధవారం ఉదయం చుక్కాయిపల్లి చెరువు సమీపంలోని బావిలో నర్సింహ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
బావిలో పడి వ్యక్తి మృతి
అమ్రాబాద్: ఈత పడేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలోపడి వ్యక్తి మృతి చెందిన ఘటన పదర మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. పదరకు చెందిన నారుమొల్ల కుమార్ (40) బుధవారం మధ్యాహ్నం తన పిల్లలకు ఈత నేర్పేందుకు గ్రామ సమీపంలోని ట్యాంకు బావికి వెళ్లారు. అప్పటికే మద్యం తాగి ఉన్న అతడు పిల్లలను ఒడ్డున ఉంచి ముందుగా బావిలో దిగి ఈతకొట్టాడు. రెండోసారి దూకిన కుమార్ తిరిగి పైకి రాలేదు. కొద్ది సేపు చూసిన పిల్లలు గ్రామంలోకి వచ్చి విషయం చెప్పడంతో కొంతమంది అక్కడికి చేరుకొని బాధితుడిని బావిలోంచి బయటకు తీశారు. నీటిలో మునిగి చాలా సేపు కావడంతో అప్పటికే మృతి చెందాడు. అయితే మద్యం తాగి ఉండటం వల్లే మృతి చెంది ఉండొచ్చని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. మృతుడికి భార్య పద్మ, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ నాగరాజుగౌడ్ తెలిపారు.


