బడి.. పిలుస్తోంది | - | Sakshi
Sakshi News home page

బడి.. పిలుస్తోంది

May 14 2026 12:25 AM | Updated on May 14 2026 12:25 AM

షెడ్యూల్‌ ప్రకారం..

అందరి సహకారంతో..

జిల్లాలో నేటినుంచి ప్రొ.జయశంకర్‌ బడిబాట

ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెంపే లక్ష్యం

ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలతో ఆకట్టుకునేలా చర్యలు

ప్రతిఒక్కరూ భాగస్వాములై విజయవంతం

చేయాలని ఆదేశాలు

ఇప్పటికే జనగణన, విద్యా వారోత్సవాల్లో

బిజీగా ఉపాధ్యాయులు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల పెంచడమే లక్ష్యంగా గురువారం నుంచి ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆటలు, చదువులు, వివిధ కార్యక్రమాల్లో సాధించిన విజయాలతో పాటు విద్యార్థులకు అందించే సదుపాయాలను చూపించి ఎక్కువ సంఖ్యలో అడ్మిషన్లు పొందేందుకు కృషి చేయాల్సి ఉంది. ఈ మేరకు వీఆర్‌ఈ (విలేజ్‌ ఎడ్యుకేషన్‌ రిజిస్ట్రర్‌) అడ్మిషన్‌ రిజిస్ట్రార్‌, పెన్‌ (పర్మనెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌)లను నవీకరించి అడ్మిషన్లు చేపట్టాల్సి ఉంది. గురువారం నుంచి బడిబాట ప్రారంభం కానుండగా.. ఉపాధ్యాయులు ఇప్పటికే విద్యా వారోత్సవాల్లో భాగంగా పలు పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు జనగణనలో కూడా పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,200 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

విద్యార్థుల గుర్తింపు..

కిందిస్థాయి అంగన్‌వాడీల్లో చదువుతున్న విద్యార్థులను ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలని, అలాగే ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఉన్నత పాఠశాలల్లో చేర్పించాలి. వీటితోపాటు సమీప నివాస ప్రాంతాలు, పని ప్రదేశాల్లో బాల, బాలికలు, దివ్యాంగ విద్యార్థులను గుర్తించడం వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న నోట్‌ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, స్కూల్‌ యూనిఫాం వంటివాటిపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి.. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రోత్సహించనున్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో గురువారం నుంచి ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. ఇందుకోసం పాఠశాలల హెచ్‌ఎంలకు ఆదేశాలు జారీ చేశాం. ఎక్కువ మొత్తంలో అడ్మిషన్లు చేర్పించేందుకు కృషి చేస్తాం. షెడ్యూల్‌ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించి విజయవంతం చేస్తాం. – ప్రవీణ్‌కుమార్‌, డీఈఓ

బడిబాటలో భాగంగా గ్రామంలోని అందరిని భాగస్వాములు చేసి కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధులు, మహిళా, యువజన, విద్యార్థి సంఘాలను భాగస్వాములుగా చేయాల్సి ఉంది. వీటితోపాటు పేరెంట్‌ టీచర్స్‌ మీటింగ్స్‌, అమ్మ ఆదర్శ కమిటీల సమావేశం, అంగన్‌వాడీ టీచర్ల సమవేశాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువతతో సమావేశం నిర్వహించాలి. గ్రామసభలు, అవగాహన ర్యాలీల ద్వారా ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన పెంపొందించాలి. డోర్‌ టు డోర్‌ క్యాంపెన్‌, సామూహిక అక్షరాభ్యాసం, స్పోర్ట్స్‌ డే వంటి కార్యక్రమాలను నెల రోజుల బడిబాటలో భాగంగా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement