ఆందోళనలో నీట్‌ విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

ఆందోళనలో నీట్‌ విద్యార్థులు

May 13 2026 1:20 AM | Updated on May 13 2026 1:20 AM

ఉమ్మడి జిల్లాలో పరీక్ష రాసిన 4,141 మంది విద్యార్థులు

సీటు వస్తుందనుకుంటే మరోసారి పరీక్ష రాయాల్సిన వస్తుందని ఆవేదన

సీటు వస్తుందని అనుకున్నాం.

పరీక్షకు కొన్నినెలలుగా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాం. పరీక్ష రాశాక తీరా పేపర్‌ లీక్‌ అయ్యిందని, మరోసారి పరీక్ష రాయాల్సి వస్తుందని తెలిసింది. పరీక్షలో మంచి మార్కులు వస్తాయని, సీటు సాధిస్తామని అనుకునేలోపే ఇలా పేపర్‌లీక్‌ గురించి తెలిసింది. వీలైనంత త్వరగా పరీక్షలు మళ్లీ నిర్వహిస్తే బాగుటుంది.

– గిరిజ, నీట్‌ అభ్యర్థిని

ఎన్నో ఆశలు పెట్టుకున్నాం

నీట్‌కు ఎన్నో రోజులు కష్టపడి సిద్ధమయ్యాం. తీరా పేపర్‌ లీక్‌ కావడంతో ఆశలన్నీ ఆవిరయ్యాయి. లీకులతో విద్యార్థుల భవిష్యత్‌ ఇబ్బందికరంగా మారింది. పరీక్ష వాయిదా వేస్తే మరోసారి కష్టపడి సమయం కేటాయించి చదవాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితాలు ప్రశ్నాపత్రంలో వచ్చిన మార్కులపై ఆధారపడి ఉంటాయి. అంచనాలు మారుతాయి. – వైష్ణవి, నీట్‌ అభ్యర్థిని

నిర్లక్ష్యం వల్లే ..

లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించే నీట్‌లో పేపర్‌ లీక్‌ కావడం బాధాకరం. ఎంతో మంది భవిష్యత్‌ దీనిపై ఆధారపడి ఉంది. పేపర్‌ లీక్‌ కావడం వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉంది. లీక్‌కు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వీలైనంత త్వరగా పరీక్ష నిర్వహిస్తే విద్యార్థులకు ఇబ్బందులు ఉండవు.

–సిద్దార్థ, నీట్‌ అభ్యర్థి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: దేశ వ్యాప్తంగా పలు మెడికల్‌ కళాశాలల్లో ఖాళీగా ఉన్న మెడికల్‌ సీట్ల భర్తీకి ఈనెల 3వ తేదీన ఎన్టీఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) ఆధ్వర్యంలో నీట్‌–యూజీ పరీక్షను నిర్వహించారు. పరీక్ష పూర్తి కావడంతో విద్యార్థులు తదుపరి ఫలితాల కోసం ఎదురుచూస్తుండగా.. పేపర్‌ లీక్‌ కావడంతో ఒక్కసారి ఉలికిపాటుకు గురయ్యారు. దీంతో పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. మంచి ర్యాంకులు సాధించేందుకు విద్యార్థులు నెలల తరబడి కసరత్తు చేసి లాంగ్‌టర్మ్‌, షార్ట్‌టర్మ్‌ కోచింగ్‌కు వెళ్లి, గంటల తరబడి సిద్ధమైతే చివరకు పరీక్ష వాయిదా పడడంతో గందరగోళం నెలకొంది. వాయిదా పడిన పరీక్ష తదుపరి ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై ఎన్టీఏ నుంచి ఇంకా స్పష్టత రాకపోవడంతో విద్యార్థులు మరోమారు కోచింగ్‌ సెంటర్లకు వెళ్లి పరీక్షకు సిద్ధమయ్యే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,141 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మరోసారి పరీక్ష రాసేందుకు ఎటువంటి దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. మరోసారి పేపర్‌ లీక్‌లకు పాల్పడకుండా, పేపర్‌ లీక్‌ చేసిన వారిపై ఖఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదు

గతంలో ఓసారి నీట్‌ రాస్తే సరైన ర్యాంకు రాకపోవడంతో లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకుని ఏడాది మొత్తం కష్టపడి చదివా. ఈ సారి కీ చూసుకుంటే 530 మార్కులు వచ్చాయి. కచ్చితంగా సీటు వస్తుంది. ఎక్కడో కొందరు చేసిన తప్పిదాల కారణంగా మొత్తం విద్యార్థుల భవిష్యత్‌ను అనిశ్చితిలోకి నెట్టడం సరైంది కాదు.ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదు. పేపర్‌ లీక్‌ జరిగినట్లయితే అందుకు బాధ్యులైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలి కానీ.. ఇలా పరీక్ష మొత్తం రద్దు చేసి విద్యార్థులను మానసిక ఆందోళనకు గురి చేయకూడదు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న పరీక్షల విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని. – ఎం.భవాని, నీట్‌ అభ్యర్థి,

కొత్తకోట, వనపర్తి జిల్లా

పేపర్‌ లీక్‌ లేకుండా చూడాలి

నీట్‌ ప్రతి విద్యార్థికి కూడా ఎంతో కీలకమైంది. ఎన్నో నెలలు కష్టపడి చదివినటువంటి పరీక్షకు సంబంధించిన పేపర్‌ లీకయితే విద్యార్థుల భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వీలైనంత త్వరగా పరీక్ష నిర్వహించాలి. – ధన్‌రాజ్‌, నీట్‌ అభ్యర్థి

సీబీటీ విధానంలో నిర్వహించాలి

ఆఫ్‌లైన్‌ పరీక్ష నిర్వహించడంతో పేపర్‌ లీక్‌ అవుతున్న క్రమంలో జేఈఈ మెయిన్స్‌ పరీక్ష నిర్వహించిన విధంగా కంప్యూటర్‌ బేస్‌డ్‌గా నిర్వహిస్తే బాగుటుంది. లక్షలాది మంది విద్యార్థులు కళలు ఒక్క లీకేజ్‌తో తలకిందులయ్యాయి. ప్రభుత్వం వెంటనే పరీక్ష నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – జ్ఞానేశ్వర్‌, నీట్‌ అభ్యర్థి

Advertisement
 
Advertisement
Advertisement