నల్లమలలో దేశ, విదేశీ ప్రతినిధుల పర్యటన | - | Sakshi
Sakshi News home page

నల్లమలలో దేశ, విదేశీ ప్రతినిధుల పర్యటన

May 13 2026 1:20 AM | Updated on May 13 2026 1:20 AM

మన్ననూర్‌: దేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రాల్లో ఒకటిగా ఉన్న అమ్రాబాద్‌ పులుల రక్షిత అభయారణ్యంలో బిగ్‌క్యాట్‌ ఆవాసాల సంరక్షణ దిశగా అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిగ్‌ క్యాట్‌ సంరక్షణ వర్క్‌షాప్‌లో భాగంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ, తెలంగాణ అటవీశాఖ, హైదరాబాద్‌ సెక్రటేరియట్‌ సంయుక్త దౌత్య ప్రతినిధి బృందం సభ్యులు అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పెద్దపిల్లి జాతికి చెందిన పెద్దపులులు, చిరుతలు, మంచు చిరుతలు, జాగ్వార్‌, సింహాల జాతుల ఆవాసాలు, పర్యావరణ సుస్థిరత, అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై 11, 12వ తేదీ రెండు రోజుల పాటు చర్చ జరిగింది. ఈ క్రమంలో మంగళవారం మన్ననూర్‌ అటవీశాఖ వనమాళిక ప్రాంగణం నుంచి అటవీ శాఖ అధికారులతో కలిసి బృందం సభ్యులు జంగిల్‌ సఫారీలో అటవీ అందాలను వీక్షించారు. అటవీశాఖ చేపట్టిన జీవ వైవిధ్యం, వన్య ప్రాణుల సంరక్షణకు సంబంధించిన చర్యలను పరిశీలించారు. అంతకు ముందు రోజు మన్ననూర్‌లోని జంగిల్‌ సఫారీకి సంబంధించిన రిసార్ట్‌లో బస చేసిన సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పులులు, వన్య ప్రాణులు, హాబిటాట్‌ పర్యవేక్షణ, ఎకో టూరిజం, పునరావాసం చర్యలపై అభినందించారు. ముఖ్యంగా వన్యప్రాణుల సంరక్షణతో పాటు వేటగాళ్ల నివారణ చర్యలు, పర్యావరుణ పునరుద్ధరణ అంశాలు చర్చకు వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బంగ్లాదేశ్‌, మలేషియా, రష్యా, శ్రీలంక, థాయ్‌లాండ్‌ దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటూ అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌ ప్రియాంక వర్గీస్‌, ఫీల్డ్‌ డైరెక్టర్‌ సునిల్‌, డీఎఫ్‌ఓ రేవంత్‌చంద్ర, ఎఫ్‌డీలు రామ్మూర్తి, రామ్మోహన్‌, రేంజ్‌ అధికారులు వీరేష్‌, గురుప్రసాద్‌, వాణి, ఎఫ్‌ఎస్‌ఓలు, ఎఫ్‌బీఓలు, సిబ్బంది పాల్గొన్నారు.

వ్యూఫాయింట్‌ వద్ద బృందానికి టైగర్‌ రిజర్వు గురించి

వివరిస్తున్న సీసీఎఫ్‌

Advertisement
 
Advertisement
Advertisement