స్తంభించిన కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

స్తంభించిన కొనుగోళ్లు

May 13 2026 1:08 AM | Updated on May 13 2026 1:08 AM

జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పంట దిగుబడుల క్రయవిక్రయాలు స్తంభించాయి. యార్డుకు వివిధ ప్రాంతాల నుంచి ధాన్యం పోటెత్తడంతో మార్కెట్‌ ఆవరణలో స్థలం లేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఎక్కడి ధాన్యం అక్కడే ఉండిపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయి. సోమవారం దాదాపు 30 వేల బస్తాల వరి ధాన్యం, మొక్కజొన్న ఇతర దిగుబడులు మార్కెట్‌కు రావడంతో కొనుగోళ్లు జరిపినా తూకాలు, బస్తాల తరలింపు చేయకపోవడంతో మంగళవారం కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. వరుసగా శుక్ర, శనివారాల్లో సైతం ఇదే సమస్య కారణంగా కొనుగోళ్లు నిలిపివేయగా.. ఆదివారం బస్తాలను గోదాంలకు తరలించడంతో సోమవారం క్రయవిక్రయాలు సాఫీగా సాగాయి. అయితే మూడు రోజుల సరుకు మంగళవారం ఒకేసారి రావడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. దీంతో కొనుగోళ్లు నిలిపివేసి.. తూకాలు, బస్తాల తరలింపు చేపట్టారు.

రోజుల తరబడి పడిగాపులు

బాదేపల్లి యార్డు ఆవరణలో సామర్థ్యానికి మించి దిగుబడులు రావడం, సకాలంలో టెండర్లు దాఖలు చేసి తూకాలు వేయడం, బస్తాల తరలింపులో ఆలస్యం చోటు చేసుకునే పరిస్థితి వస్తుంది. దీంతో రోజు విడిచి రోజు కొనుగోళ్లు చేయాలని మార్కెట్‌ యార్డు అధికారులు, పాలక మండలి నిర్ణయించారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు రెండు, మూడు రోజులపాటు మార్కెట్‌లోనే పడిగాపులు కాయాల్సి వస్తుంది.

లారీలు, హమాలీలతో ఇబ్బందులు

ఒకవైపు పేరుకుపోయిన నిల్వలు.. మరోవైపు మొక్కజొన్న ఇతర దిగుబడులు మార్కెట్‌కు ప్రతిరోజు భారీగా వస్తుంది. ఈ క్రమంలో బస్తాలు తరలించేందుకు లారీలు, హమాలీలు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మార్కెట్‌ నుంచి బయటి ప్రాంతాల్లోని గోదాంలకు తరలించాలంటే అక్కడ కూడా ఖాళీ లేని పరిస్థితి కారణంగా ఆలస్యం జరుగుతుంది. కాబట్టి క్రయవిక్రయాలలో ఇబ్బందులు రాకుండా చూడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన పంట దిగుబడులను అమ్మడానికి సైతం ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉందని, ప్రైవేట్‌ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వ్యాపారుల కుమ్మక్కు..?

ధాన్యం దిగుబడులు అధికంగా రావడం, రోజుల తరబడి రైతులు మార్కెట్‌లోనే ఉండిపోయే పరిస్థితులు తలెత్తడం కారణంగా వ్యాపారులు ఇదే అదునుగా తక్కువ ధర కేటాయిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు.

బాదేపల్లి యార్డుకు పోటెత్తిన మొక్కజొన్న, వరిధాన్యం

ఇకపై రోజు విడిచి

రోజు చేపట్టాలని నిర్ణయం

మంగళవారం కొనుగోళ్లు

నిలిపివేత.. నేడు టెండర్‌ ప్రక్రియ

తీవ్ర ఆందోళనలో రైతులు

Advertisement
 
Advertisement
Advertisement