జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఉదండాపూర్ రిజర్వాయర్ భూ నిర్వాసితుల పునరావాసం (ఆర్‌అండ్‌ఆర్) పనులను వేగంగా పూర్తిచేసి నిర్వాసిత కుటుంబాలను వీలైనంత త్వరగా పునరావాస కాలనీకి తరలించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో కలెక్టర్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో కలిసి ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉదండాపూర్ పునరావాస కాలనీలో పెండింగ్‌లో ఉన్న పనులను తక్షణమే పూర్తిచేయాలన్నారు. ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ నుంచి అవసరమైన డిజైన్ అనుమతులు తీసుకుని పనులను ప్రారంభించాలని సూచించారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం, అంతర్గత రహదారులు, విద్యుత్ సదుపాయాలు, ఇతర మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణం మూలంగా మిగిలిన వ్యవసాయ భూములకు వెళ్లడానికి బండ్ల బాటలు వేయాలని ఎమ్మెల్యే కోరగా ఈ విషయాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ జడ్చర్ల తహసీల్దార్‌ను ఆదేశించారు.
● ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం నిధులు జమ చేసినా ఇప్పటి వరకు ఒక్క కుటుంబం కూడా పునరావాస కాలనీకి వెళ్లకపోవడం సరికాదన్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి నిర్వాసితులను కాలనీకి తరలించాలన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల తరహాలో ప్లాట్లను లబ్ధిదారుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేస్తే వారు ఇళ్ల నిర్మాణానికి ముందుకు వస్తారని సూచించారు.
ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు
మొక్కజొన్న, వరిధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి ఆయన వీసీ నిర్వహించారు. జిల్లాలోని ప్రతి ప్రైవేట్ గోదాంను అవసరమైతే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని నిల్వ సదుపాయాలు పెంచాలని, జిల్లాలో స్థానిక హమాలీలను వందశాతం వినియోగించుకోవాలని సూచించా రు. హమాలీలు అధికంగా డబ్బు డిమాండ్ చేస్తే లైసెన్సు రద్దు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత పరిశీలన అనంతరం రైతులకు వెంటనే రశీదులు ఇవ్వాలని, రైస్ మిల్లుల వద్ద ఎలాంటి కోతలు ఉండకూడదని, రవాణా కోసం ఖాళీగా ఉన్న అన్ని వాహనాలు, ట్రాక్టర్లు, డీసీఎంలను పూర్తిస్థాయిలో వినియోగించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్ కవర్లు సిద్ధంగా ఉంచాలని, తడిసి న ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ప్రతిరోజు కొను గోళ్ల పురోగతిని సమీక్షించాలని చెప్పారు. అనంతరం కలెక్టర్ ఖుష్బు గుప్తా మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పకడ్బందీ చర్యలు చేపడుతున్నామన్నారు.


