హన్వాడ: నీటి సంపులో పడి బాలుడి మృతి చెందిన ఘటన మండలంలోని మాధారంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నరసయ్య కుమారుడు లక్కీ(6) ఇద్దరు స్నేహితులతో కలిసి తమ ఇంటి పరిసరాల్లోనే ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో తమ ఇంటి ముందు తవ్విన నీటి సంపులో పడి ఊపిరాడక మృతి చెందాడు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై మరో ఇద్దరు చిన్నారులను కాపాడినా లక్కీని మాత్రం రక్షించలేకపోయారు. స్కూళ్లకు సెలవులు వస్తే పిల్లలు కళ్ల ముందు తిరుగుతూ సందడి చేస్తారని సంబరపడే తల్లిదండ్రులకు తీరని గర్భశోకం మిగిలిందని వాపోతున్నారు. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకోవాల్సిన బిడ్డ విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
గద్వాల క్రైం: గుర్తు తెలియని రైలు కిందపడి వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ అశోక్‌కుమార్ తెలిపారు. ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి(70) రైలులో ప్రయాణిస్తూ.. ప్రమాదవశాత్తు జారి కిందపడడంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాల కోసం రైల్వే పోలీసులను సంప్రదించాల్సిందిగా హెడ్ కానిస్టేబుల్ సూచించారు.


