‘కిస్తీ’మే సవాల్‌ | - | Sakshi
Sakshi News home page

‘కిస్తీ’మే సవాల్‌

May 12 2026 1:14 AM | Updated on May 12 2026 1:14 AM

సర్కారి కిస్తీయే ప్రధానం

ఉత్సాహంగా పెద్దకిస్తీ పోటీలు

వైభవంగా షా అలీ పహిల్వార్‌ దర్గా ఉర్సు

ప్రసాదం కోసం పోటీపడిన

పహిల్వాన్‌లు

వేలాదిగా తరలివచ్చిన భక్తులు

అలంపూర్‌: హజరత్‌ షా అలీ పహిల్వాన్‌ ఉర్సులో కిస్తీ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. భక్త జనసందోహం మద్య పెద్ద కిస్తీ పోటీలు పోటాపోటీగా జరిగాయి. కిీస్తీలో వేసిన తబురుక్‌(ప్రసాదం) కోసం పహిల్వాన్‌లు పోటీ పడ్డారు. కిస్తీలో వేసిన ప్రసాదాన్ని పహిల్వాన్‌లు భక్తులపైకి విసురుతూ ఉర్సు ప్రాధాన్యతను కొనసాగించారు. అలంపూర్‌లో వెలిసిన హజ్రత్‌ షా అలీ పహిల్వాన్‌ ఉర్సు సోమవారం మూడోరోజుకు చేరుకుంది. హజ్రత్‌ షా అలీ పహిల్వాన్‌ ధడ్‌ ముబారక్‌ దర్గాల్లో పెద్ద కిస్తీ పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉర్సుకు ప్రధాన ఆకర్షణగా నిర్వహించే పెద్ద కిస్తీ పోటీలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలొచ్చారు. పహిల్వాన్‌లు అబ్బురపరిచే విన్యాసాలతో వీక్షకులను అలరిస్తూ కిస్తీల్లో పోటీపడ్డారు. భక్తులు ఆనందోత్సవాల మధ్య కిస్తీ పోటీలను తిలకించారు.

ఉత్సాహంగా ఉర్సు

హజ్రత్‌ షా అలీ పహిల్వాన్‌ ఉర్సును భక్తులు ఉత్సహంగా జరుపుకొన్నారు. పెద్ద కిస్తీ పోటీల కోసం భక్తులు ప్రసాదాన్ని మేళతాలల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి కిస్తీ పోటీలకు సమర్పించారు. పట్టణంలోని వివిధ కాలనీలు, మండలంలోని ఆయా గ్రామాల నుంచి సైతం భక్తులు కిస్తీ పోటీలకు ప్రసాదంను అందించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక అండాల్లో(పలావ్‌) సిద్ధం చేసుకొని కాడేద్దుల బండ్లు, ట్రాక్టర్లలో దర్గా వద్దకు చేరుకొని ప్రసాదం అందించి కిస్తీలను కొనసాగించారు. ఉర్సుకు తరలివచ్చిన భక్తజలతో ప్రధాన వీధులు సందడిగా మారాయి. ఉర్సుకు చుట్టుపక్కల గ్రామాలతోపాటు వివిధ ప్రాంతాల భక్తులు వచ్చారు. ప్రధాన రహదారుల్లోని మిఠాయి, బొమ్మల, బ్యాంగిల్స్‌ దుకాణాలు కొనుగోళ్లతో రద్దీగా కనిపించాయి. రంగులరాట్నాల వద్ద పిల్లలు సందడి చేశారు.

ఉర్సు ఉత్సవాలలో సర్కారి కిస్తీయే ప్రధానంగా కొనసాగుతుంది. దర్గా అభివృద్ధి కమిటీ చైర్మన్‌ సయ్యద్‌ అహ్మద్‌ షా ఒవైసీ అధ్వర్యంలో సర్కారి కిస్తీ పోటీలు ప్రారంభించారు. ఎమ్మెల్యే విజయుడు దర్గాలను సందర్శించి ప్రార్థనలు చేశారు. అనంతరం కిస్తీ వద్దకు వద్దకు చేరుకున్నారు. నిర్వాహక కమిటీ సభ్యులు ఎమ్మెల్యే విజయుడు, మున్సిపల్‌ చైర్మన్‌ జయరాముడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మహ్మద్‌ ఇస్మాయిల్‌ను శాలువాలు, పూలమాలతో సన్మానించారు. అనంతరం సయ్యద్‌ ఖాదర్‌ బాషా ఇంటినుంచి వచ్చిన సర్కారి కిస్తీని ఊరేగింపుగా దర్గాల వద్దకు తీసుకొచ్చారు. అక్కడ నిర్వాహక కమిటీ సభ్యులు ప్రసాదంను పడవలాంటి ఆకారంలో ఉన్న కిస్తీలో నింపి సర్కారి కిస్తీని సిద్ధం చేశారు. మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం కిస్తీ పోటీలను ప్రారంభించారు. పహిల్వాన్‌లు పోటీపడుతు బలప్రదర్శనతో ప్రసాదాన్ని దక్కించుకోని భక్తులపైకి విసిరుతూ పోటీలను కొనసాగించారు. కిస్తీ పోటీలకు వచ్చిన పహిల్వాన్‌లు విన్యాసాలను ప్రదర్శిస్తూ ఆహుతులను ఆకట్టుకున్నారు. ఉర్సులో సీఐ ప్రదీప్‌, ఎస్‌ఐ రామకృష్ణల అధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement