క్లుప్తంగా
గోపాల్‌పేట: రోడ్డుపై ఆరబోసిన మక్కల కుప్పను బైక్‌తో ఢీకొని ఓ యువకుడు మృతిచెందినట్లు ఎస్‌ఐ జగన్‌మోహన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఏదుల మండల కేంద్రానికి చెందిన వీరపాగ కృష్ణ(25) ఆదివారం సాయంత్రం రేవల్లికి వెళ్లాడు. రాత్రికి తిరిగి వస్తుండగా ఏదుల రిజర్వాయర్ వద్ద రోడ్డుపై బ్రిడ్జిపై అనంతపురం గ్రామానికి చెందిన చిన్ననర్సింహ మక్కలను ఆరబోసి నల్లకవర్ కప్పి వెళ్లిపోయాడు. ఇది గమనించకుండా బైక్‌పై వెళ్లి మక్కలకుప్పను ఢీకొట్టడంతో కృష్ణ ఎగిరిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సోమవారం ఉదయం అక్కడికి వచ్చిన రైతులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తండ్రి దానయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
బావిలో పడి
వృద్ధురాలి మృతి
మానవపాడు: ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ స్వాతి తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని జల్లాపురం గ్రామానికి వడ్డె లక్ష్మమ్మ (80) సోమవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. మృతురాలికి నలుగురు కుమారులు, ముగ్గరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై ఎస్‌ఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ పేర్కొన్నారు.
కొత్త యాపట్లలో
పులి కలకలం
పెద్దకొత్తపల్లి: మండలంలోని కొత్తయాపట్ల నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరించడంతో గ్రామస్తులు భయందోళనకు గురయ్యారు. గ్రామానికి చెందిన గొల్ల శివుడు ఆదివారం సాయంత్రం అడవిలో మేకలను మేపుకొని ఇంటికి తిరిగి వస్తుండగా.. మేకల గుంపుపై పెద్ద పులి దాడి చేసి ఒక మేకను లాక్కెళ్లిందన్నారు. మంద వెంట ఉన్న కుక్కలు పులిని వెంబడించగా మేకను వదిలిపెట్టి అడవిలోకి పారిపోయిందని గొర్రెల కాపారి తెలిపారు. కొత్త యాపట్ల సమీపంలో పులి కనిపించడంతో గొర్రెల కాపారులు, గ్రామస్తులు రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.


