జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. సోమవారం తెల్లవారుజామున బైపాస్‌లోని పాల్‌కొండ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూకట్‌పల్లిలో ఒక అమ్మాయిని చంపేసి దొంగతనం చేశారని, మాజీ డీజీపీ భార్యను చంపి దొంగతనం చేసినట్లు తెలిపారు. బాధ్యత గల కేంద్ర మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ కొడుకు భగీరథను అదుపులో పెట్టుకోలేదని, ర్యాగింగ్ చేసిన సమయంలోనే అదుపులో పెట్టి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు. కొడుకును గాలికి వదిలేయడంతో అమ్మాయి జీవితాలతో చెలగాటం అడుతున్నారడని ఆరోపించారు. అమ్మాయి కేసు పెడితే పోలీసులు కనీసం కేసు నమోదు చేసుకోలేదని విమర్శించారు. అమ్మాయిపై తెలివిగా వేరే ప్రాంతంలో కేసులు పెట్టించి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. హిందువులు, ముస్లింలను రెచ్చగొట్టుడు తప్పా.. బండి సంజయ్ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. సంజయ్ స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాలని, కొడుకుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సహకారం ఇవ్వాలన్నారు. కేసీఆర్, కేటీఆర్ మీద నోరు పారేసుకోవడం తప్పా రాష్ట్రానికి ఒక్కపైస తెచ్చే తెలివిలేదన్నారు. రాష్టంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై పని చేస్తున్నాయని ఆరోపించారు. రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలే నిదర్శనమన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉంటే బయటి నుంచి పెట్టుబడులు రావడం కష్టం అవుతుందన్నారు.


