తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం

May 12 2026 1:02 AM | Updated on May 12 2026 1:02 AM

ప్రశ్న: తెలంగాణ చౌరస్తాలో తరచూ మెయిన్‌ పైపులైన్‌ పగిలి తాగునీరు లీకేజీ అవుతోంది. ఎన్నిసార్లు బాగు చేసినా ఉపయోగం లేకుండాపోతోంది. – మోహన్‌,

క్రిస్టియన్‌కాలనీ (డివిజన్‌ నం.41)

మేయర్‌: తాగునీటి వ్యవస్థ పటిష్టానికి నగరానికి మంజూరైన రూ.220 కోట్లతో త్వరలోనే కొత్త పైపులైన్‌ వేయనున్నాం. అప్పుడు తప్పక అక్కడ మార్చి ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారమయ్యేలా చూస్తాం.

సమస్యాత్మక ప్రాంతాలకు ట్యాంకర్లు

నగర మేయర్‌ జి.మమత

‘సాక్షి’ ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి విశేష స్పందన

ప్రశ్న: వారంలో రెండు రోజులు మాత్రమే మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగునీరు వస్తోంది. అందులోనూ ఒండ్రు కలిసి రావడంతో తాగే పరిస్థితి లేదు.

– శాంతిభూషణ్‌, బీసీ కాలనీ, ఏనుగొండ (డివిజన్‌ నం.2)

మేయర్‌: ఇక నుంచి సమీపంలోని ఓవర్‌హెడ్‌ ట్యాంకును శుభ్రం చేయించిన తర్వాతే తాగునీరు వదులుతాం.

ప్రశ్న: పీహెచ్‌సీ సమీపంలోని పాత నీటి ట్యాంకు వద్ద అంతా అపరిశుభ్రంగా ఉంది. అక్కడ చెత్తాచెదారం వేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం పొంచి ఉంది.

– ఆనంద్‌కుమార్‌, సుభాష్‌నగర్‌ (డివిజన్‌ నం.56)

మేయర్‌: అక్కడికి పారిశుద్ధ్య సిబ్బందిని పంపించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తాం. చెత్త వేయొద్దని బోర్డు ఏర్పాటు చేయిస్తాం.

ప్రశ్న: ఆరు నెలలుగా మా ప్రాంతంలోని పవర్‌ బోర్‌ పని చేయడం లేదు. ఈ విషయమై మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా ఇంత వరకు స్పందించడం లేదు.

– సిద్దిరామప్ప, జగదాంబ కాలనీ, (డివిజన్‌ నం.45)

మేయర్‌: అక్కడికి ఇంజినీరింగ్‌ అధికారులను పంపిస్తాం. వీలైనంత త్వరగా పవర్‌ బోరును బాగు చేయిస్తాం.

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: నగరంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ జి.మమత హామీ ఇచ్చారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలకు వాటర్‌ ట్యాంకర్లు పంపిస్తామన్నారు. ఇదే అంశంపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో సోమవారం ఆమెతో నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. పలువురు నగర ప్రజలు తమ డివిజన్లలో నెలకొన్న తాగునీటి సమస్యలను ప్రస్తావించారు.

ప్రశ్న: మిషన్‌ భగీరథ పథకం పైపులైన్లు పగిలినప్పుడు తాగునీటి సరఫరా నిలిచిపోతోంది. దీనిపై మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించడం లేదు.

– షేక్‌ ఫారూక్‌ హుస్సేన్‌, షాషాబ్‌గుట్ట–న్యూటౌన్‌ ప్రాంతం (డివిజన్‌ నం.59)

మేయర్‌: వెనువెంటనే బాగు చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచిస్తాం. ఇక ముందు ఎలాంటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న: నెల రోజులుగా మా ఇంటి (నం.1–1–9/22/3/2)కి మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. చుట్టుపక్కల వారికి వస్తున్నా, మాకు మాత్రం అందడం లేదు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించడం లేదు.

– కె.రాములు, న్యూమోతినగర్‌ (డివిజన్‌ నం.18)

మేయర్‌: మీ ప్రాంతానికి వెంటనే ఇంజినీరింగ్‌ సిబ్బందికి పంపించి ఈ సమస్యను పరిష్కరిస్తాం.

ప్రశ్న: మా ప్రాంతానికి మూడు రోజులకోసారి మాత్రమే తాగునీరు సరఫరా అవుతోంది. పాల్‌సాబ్‌గుట్టలోని ఓవర్‌హెడ్‌ ట్యాంకు నుంచి సన్నగా వస్తున్నాయి. దీంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

– బాబా, సద్దలగుండు (డివిజన్‌ నం.47)

మేయర్‌: మిషన్‌ భగీరథ పథకం ద్వారా సరఫరా కాని రోజుల్లో అక్కడికి మున్సిపల్‌ వాటర్‌ ట్యాంకర్‌ను పంపిస్తాం.

ప్రశ్న: వేసవికాలం కావడంతో తరచూ తాగునీటి సమస్య తలెత్తుతోంది. సమీపంలోని పవర్‌ బోరు నుంచి నీరు సైతం సరిగా రావడం లేదు.

– అనుపటి చెన్నయ్య, ఎస్సీ కాలనీ, ఏనుగొండ (డివిజన్‌ నం.2)

మేయర్‌: ఇంజినీరింగ్‌ సిబ్బందిని అక్కడికి పంపి పవర్‌ బోరు ప్రెస్సింగ్‌ చేయిస్తాం.

ప్రశ్న: మూడు రోజులకోసారి మిషన్‌ భగీరథ పథకం ద్వారా వస్తున్న తాగునీరు ఎక్కువ సేపు వదలాలి. సన్నగా వదలడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

– శ్రీకాంత్‌, ఎదిర (డివిజన్‌ నం.5)/ రమేష్‌, ఏనుగొండ (డివిజన్‌ నం.6)

మేయర్‌: మీ ప్రాంతాలకు అవసరమైనప్పుడు మున్సిపల్‌ ట్యాంకర్‌ పంపిస్తాం.

Advertisement
 
Advertisement
Advertisement