ఒక ప్రమాదం.. 2 కుటుంబాల్లో విషాదం | - | Sakshi
Sakshi News home page

ఒక ప్రమాదం.. 2 కుటుంబాల్లో విషాదం

May 12 2026 1:02 AM | Updated on May 12 2026 1:02 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: పాలకొండ బైపాస్‌ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పోర్ట్స్‌ బైక్‌ రైడర్‌ అతివేగం వల్ల నగరంలో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. న్యూ ప్రేమ్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ బాసిద్‌ భార్య సారాబేగం ఇద్దరు పిల్లలతో పాటు రబియా మజీద్‌ ఏరియాకు చెందిన సారాబేగం తల్లి గౌసియా బేగం ఆమె కొడలు రేష్మా ఖాతూమ్‌, ఇద్దరు మనవలతో కలిసి యూబీ గార్డెన్‌లో జరిగిన బంధువుల పెళ్లికి హాజరయ్యారు. అప్పటి వరకు సంతోషంగా గడిపిన ఆ రెండు కుటుంబాలు శుభకార్యం పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్ర మంలో బైకర్‌ రూపంలో వచ్చిన ప్రమాదం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. దీంతో ప్రేమ్‌నగర్‌తో పాటు రబియా మజీద్‌ ఏరియా(మర్లు)లో విషాదం అలుముకుంది. అటు మహ్మద్‌ బాసిద్‌ కుటుంబంలో బాసిత్‌తో పాటు అతని ఏడేళ్ల కొడుకు మహ్మద్‌ జైద్‌ గాయపడ్డారు. భార్య సారా బేగం(30), కొడుకు హుజేఫా(9) మృతి చెందారు. ఇటు గౌషియా బేగం, ఆమె కొడలు రేష్మా ఖాతూ మ్‌, నాలుగేళ్ల మనవడు మహ్మద్‌ జమాద్‌ద్దీన్‌ తీవ్రంగా గాయపడ్డారు. మరో రెండేళ్ల మనవడు మహ్మద్‌ హమ్మర్‌ మృతి చెందాడు. ఇటీవల దుబాయ్‌ వెళ్లిన హమ్మర్‌ తండ్రి మహ్మద్‌ ఇమ్రాన్‌ వెంటనే ఇండియాకు బయల్దేరాడు. ప్రమాద విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు సోమవారం జనరల్‌ ఆస్పత్రికి భారీగా చేరుకున్నారు.

ఇద్దరూ స్నేహితులే..

ఈ ఘటనలో మృతి చెందిన బైకర్లు హైదరాబాద్‌లోని చార్మినార్‌కు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ ఒవైజ్‌(30), మెహదీపట్నంకు చెందిన ఎండీ యాకూబ్‌ అబ్జల్‌(26) ఇద్దరూ స్నేహితులే. ఆదివారం రాత్రి మహబూబ్‌నగర్‌లోని మెట్రో ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమానికి మరికొంతమంది స్నేహితులతో కలిసి హైదరాబాద్‌ నుంచి స్పోర్ట్స్‌ బైక్‌లపై మహబూబ్‌నగర్‌కు వచ్చారు. కార్యక్రమం పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్‌ వెళ్తుంటే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన బైక్‌ రిజిస్ట్రేషన్‌ మాత్రం హర్యాన పాసింగ్‌ ఉండటం విశేషం. వీరితో పాటు వచ్చిన ఇతర బైకర్లు ఎవరు? ప్రమాదం జరిగిన తర్వాత వారు ఎటూ వెళ్లారు అనేది మహబూబ్‌నగర్‌ పోలీసులు ఆరా తీసే పనిలో ఉన్నారు.

● రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు మృతదేహలను జనరల్‌ ఆస్పత్రి పోస్టుమార్టంకు తరలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రులకు తరలించారు. ఘటన జరిగిన తీరుతో పాటు ఇతర అంశాలను అదనపు ఎస్పీ ఎన్‌బీ రత్నం, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, సీసీఎస్‌ సీఐ కృష్ణ, రూరల్‌ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ పర్యవేక్షించి బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు.

బైపాస్‌పై రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం

మరో ఐదుగురికి తీవ్ర గాయాలు

ప్రేమ్‌నగర్‌, రబియా మజీద్‌ ఏరియాలో విషాదం

Advertisement
 
Advertisement
Advertisement