ప్రజావాణికి 114 వినతులు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి 114 వినతులు

May 12 2026 1:02 AM | Updated on May 12 2026 1:02 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ప్రజావాణిలో బాధితుల నుంచి అందిన ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచకుండా ప్రతి దరఖాస్తును సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణికి జిల్లా అధికారులు కచ్చితంగా హాజరు కావాలన్నారు. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, ఎకై ్సజ్‌, భూ సర్వే రికార్డులు, గృహనిర్మాణం, జిల్లా సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమం, రోడ్డు రవాణా, బ్యాంకింగ్‌, పోలీస్‌, విద్య, వైద్యం, గ్రామీణ అభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన 114 వినతులను అధికారులు నమోదు చేసుకున్నారు. అడిషనల్‌ కలెక్టర్లు మధుసుదన్‌నాయక్‌, హరిప్రియ, డీఆర్‌ఓ రాంరెడ్డి, జెడ్పీ సీఈఓ వెంకట్‌ రెడ్డి, డీఆర్‌డీఓ నరసింహులు పాల్గొన్నారు.

ఈవీఎం గోదాం తనిఖీ

కలెక్టరేట్‌ ఆవరణలో ఉన్న ఈవీఎం గోదాం భద్రత ఏర్పాట్లు, సీల్‌ను కలెక్టర్‌ ఖుష్బూగుప్తా తనిఖీ చేశారు. ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు.

ఎస్టీ గురుకులాల్లో అడ్మిషన్లు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు గురుకులాల్లో ఖాళీగా ఉన్న ఇంటర్మీడియట్‌ సీట్లను భర్తీ చేస్తున్నట్లు ఆర్సీఓ కల్యాణి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 9 గురుకులాల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఈ నెల 16, 18 కౌన్సెలింగ్‌ నిర్వహించిన భర్తీ చేస్తామన్నారు. ధర్మాపూర్‌ వద్ద ఉన్న ఎస్టీ బాలికల హాస్టల్‌లో కౌన్సెలింగ్‌ ఉంటుదని, పదోతరగతి ఉత్తీర్ణులైన వారు, ఒరిజినల్‌ సర్టిఫికెట్లుతో హాజరుకావాలని, మరింత సమాచారం కోసం 94909 57312, 94909 57314, 94909 57315 నంబర్‌లను సంప్రదించాలని సూచించారు.

క్రీడాకారులకు సన్మానం

మహబూబ్‌నగర్‌ క్రీడలు: వరంగల్‌లో ఈనెల 10వ తేదీన జరిగిన రాష్ట్రస్థాయి అంతర్‌ జిల్లాల అథ్లెటిక్స్‌ పోటీల్లో పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులను సన్మానించారు. ఈ పోటీల్లో పురుషుల 400 మీటర్ల పరుగులో డి.శ్రీధర్‌ బంగారు పతకం, 18ఏళ్ల లోపు బాలికల విభాగం డిస్కస్‌త్రోలో పౌర్ణమి బంగారం, షాట్‌పుట్‌లో కాంస్యం, 18 ఏళ్లలోపు బాలికల విభాగం లాంగ్‌జంప్‌లో సాయికీర్తన కాంస్యం, 20 ఏళ్ల లోపు బాలుర 400 మీటర్ల పరుగులో కేతావత్‌ నవీన్‌ కాంస్యం సాధించినట్లు జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్‌చంద్ర పేర్కొన్నారు. అథ్లెట్లను సోమవారం జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం ఉపాధ్యక్షుడు రాజేంద్రకుమార్‌. సి.శ్రీనివాసులు శాలువాలతో సత్కరించి అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement