హెచ్‌పీవీ నత్తనడకన | - | Sakshi
Sakshi News home page

హెచ్‌పీవీ నత్తనడకన

May 11 2026 8:26 AM | Updated on May 11 2026 8:26 AM

ఫోన్‌ చేయాల్సిన నంబర్‌: 94413 57967
తేది: 11–05–2026, సమయం: సోమవారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు

జిల్లాలో 14–15 ఏళ్లు బాలికలు 8,563 ఉన్నట్లు గుర్తించిన ఆరోగ్యశాఖ

రెండు నెలల్లో 2,510 మందికే

వ్యాక్సినేషన్‌

అర్బన్‌, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ల్లో అధ్వానం

లక్ష్యంలో 50 శాతం కూడా చేరని వైనం

పాలమూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ పంపిణీ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. కిషోర బాలికల్లో భవిష్యత్‌లో సర్వైకల్‌ (గర్భాశయ ముఖ ద్వారా) క్యాన్సర్‌ రాకుండా ప్రభుత్వం ప్రారంభించిన హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఆదరణ లభించడం లేదు. 14–15 వయసు మధ్య బాలికలకు ఉద్దేశించిన ఈ వ్యాక్సిన్‌ను మార్చి 8న మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో ప్రారంభించారు. అయితే ఈ టీకా విషయంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకపోవడం, అపోహ లు నెలకొనడంతో కార్యక్రమం నత్తనడకన సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు నెలల వ్యవధిలో జిల్లాలో కేవలం 2,510 మంది బాలికలకు మాత్రమే టీకాలు అందించారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఇవ్వడానికి జిల్లా వ్యాప్తంగా 14–15 ఏళ్లు ఉన్న బాలికలను 8,563 మందిని గుర్తించారు. రెండు నెలలు గడుస్తున్న లక్ష్యంలో 50 శాతం కూడా చేరుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

జిల్లావ్యాప్తంగా 14–15 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకాలను వేయడానికి జనరల్‌ ఆస్పత్రి, జడ్చర్ల ఆస్పత్రిలో మార్చి 8న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆనంతరం అర్బన్‌ హెల్త్‌సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సైతం విస్తరించారు. ఇప్పటి వరకు జనరల్‌ ఆస్పత్రిలో 406, గండేడ్‌లో 339, జడ్చర్లలో 215, నవాబ్‌పేటలో 176, బాలానగర్‌లో 163, జానంపేట 134, ఎదిర 211, భూత్పూర్‌లో 102 మంది మాత్రమే వ్యాక్సిన్‌ ఇచ్చారు. నగరంలో ఉన్న అర్బన్‌ హెల్త్‌సెంటర్‌లలో ఇప్పటి వరకు కుమ్మరివాడిలో ఒకరు, మోతీనగర్‌లో ఆరు, రామయ్యభౌళిలో ఒకరు, పాత పాలమూరులో ఇద్దరికి ఇచ్చారు. పలు పీహెచ్‌సీల్లో వ్యాక్సిన్‌ తీసుకున్న వారి సంఖ్య రెండు అంకెలు కూడా దాటలేదు.

Advertisement
 
Advertisement
Advertisement