జడ్చర్ల: ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన మొక్కజొన్న దిగుబడులను విక్రయించేందుకు వచ్చిన రైతులు రోజుల తరబడి పడిగాపులు పడుతున్నా.. కొనుగోళ్లు చేయకపోవడంతో నీరసించిన రైతన్న కడుపు మండి రోడ్డెక్కిన దుస్థితి శనివారం జడ్చర్లలో చోటుచేసుకుంది. జడ్చర్ల పత్తి మార్కెట్ యార్డులో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్కడ కొనుగోళ్లు సజావుగా సాగక రైతాంగం చివరికి రగిలిపోయి ఆందోళనకు దిగింది. ఎదురుగా ఉన్న 167వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
● మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ఇప్పటివరకు 40 వేల బస్తాలను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన బస్తాలను సైతం గోదాములకు తరలించకపోవడంతో సమస్య మొదలైంది. లారీలు, హమాలీలు లేకపోవడంతో మొదటగా బస్తాలను తరలించలేకపోయారు. తదుపరి గోదాములు ఖాళీగా లేకపోవడంతో అన్‌లోడ్ చేయడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో కొనుగోళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నెల రోజులకు పైగా మొక్కజొన్న కుప్పలు, బస్తాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. తూకాలు పూర్తయినా బస్తాలను తరలించే వరకు రైతులను బాధ్యులను చేయడంతో రైతులు ఎటూ కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో శుక్రవారం తూకాలు వేసిన బస్తాలను రైతులే స్వయంగా 40 ట్రాక్టర్లలో లోడ్ చేసుకుని చర్లపల్లి సమీపంలోని గోదాములకు తరలించారు. అయితే అక్కడ కేవలం 4 ట్రాక్టర్లను మాత్రం అన్‌లోడ్ చేసుకుని గోదాములు ఖాళీగా లేవంటూ వెనక్కి పంపారు. దీంతో మళ్లీ ఆయా ట్రాక్టర్లను కొనుగోలు కేంద్రానికి తీసుకురావడం రైతుల ఆగ్రహానికి కారణమైంది.
చైర్‌పర్సన్ భర్తపై రైతుల ఆగ్రహం
రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ జ్యోతి భర్త అల్వాల్‌రెడ్డి అక్కడకు చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నంలో ఓ రైతును కోప్పడడంతో ఒక్కసారిగా రైతులు తిరగబడ్డారు. ఈయనేనా చైర్మన్.. ఇన్నాళ్లు యాడున్నావంటూ మండిపడ్డారు. మార్కెట్ చైర్మన్, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
● రైతుల ఆందోళనతో జడ్చర్ల–కల్వకుర్తి ప్రధాన రోడ్డుపై ఆరు గంటలపాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. సుమారు 5కిమీల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. ఎండాకాలం కావడంతో ప్రయాణికులు నీళ్లకు, తిండికి ఇబ్బందులు పడ్డారు. చిన్నపిల్లలు, మహిళలు కొందరు ఎండను తాళలేక వెనక్కి వెళ్లిపోయారు. రోడ్డు పక్కదారులకు కూడా ట్రాక్టర్లను అడ్డుపపెట్టి మూసి వేయడంతో వాహనాలు ఎటూ కదలకుండాపోయాయి.
ఇదేనా.. ప్రజాపాలనా?:
మాజీమంత్రి లక్ష్మారెడ్డి
రైతులు పంట పండించేందుకు మూడు నెలలు పడితే.. వచ్చిన దిగుబడులను అమ్ముకునేందుకు మరో మూడునెలలు పడుతుందుని, ఆలోగా అకాల వర్షాలతో దిగుబడులకు నష్ట వాటిల్లి రైతులు ఆధోగతి పాలవుతున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. రైతుల ఆందోళనకు ఆయన మద్దతు పలికి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేయడమేనా.. ప్రజాపాలన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పాలనలో ఇలాంటి దుస్థితి ఏనాడు రాలేదన్నారు. ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అటు ప్రభుత్వం ఇటు అధికారులు ఎంతమాత్రం రైతుల గోసను పట్టించుకోవడం లేదన్నారు. కొనుగోలు కేంద్రానికి లక్ష బస్తాలకుపైగా విక్రయానికి వచ్చాయని.. వెంటనే కొనుగోళ్లు చేపట్టి రైతులకు న్యాయం చేయకపోతే ఉపేక్షించబోమని హెచ్చరించారు. చివరకు మార్క్‌ఫెడ్ డీఎం రహెమున్నిసా బేగం, తహసీల్దార్ నర్సిగరావు, సింగిల్‌విండో సీసీఓ యాదగిరితో చర్చించి పత్తి మార్కెట్ యార్డు షెడ్లలోనే బస్తాలను నిల్వ చేసేవిధంగా నిర్ణయం తీసుకోవడంతో సమస్య సద్దుమణిగింది. తూకం వేసిన బస్తాలను వెంటనే ఆయా షెడ్లలోనే నిల్వ చేస్తామని అధికారులు ప్రకటించడంతో మాజీ మంత్రి రైతులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ యాదయ్య, నాయకులు రామ్మోహన్, ఇమ్ము, జ్యోతి, రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అన్ని తామే భరిస్తున్నాం..
మొక్కజొన్నను విక్రయించేందుకు గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదని, బయటి నుంచి తామే కొనుగోలు చేసుకుని వచ్చినా.. తూకాలు వేయడం లేదని పలువురు రైతులు పేర్కొన్నారు. గన్నీబ్యాగులతో పాటు తూకా లు వేసేందుకు బస్తాకు రూ.27 చెల్లిస్తున్నామని, బస్తాలను కుట్టు వేసే సుత్తిలి ధారాలను సైతం తామే బయటి నుంచి కొనుగోలు చేసి అందిస్తున్నామని రైతులు వాపోయారు. చివరకు గోదాముల వద్దకు ట్రాక్టర్లతో తాము తరలించినా అన్‌లోడ్ చేయకుండా వెనక్కి పంపారని మండిపడ్డారు.
మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ ఆందోళన
బస్తాల లోడ్ ట్రాక్టర్లను అడ్డుగా పెట్టి నిరసన
167వ నంబర్ జాతీయ రహదారిపై ధర్నా
ఆరు గంటల పాటు నిలిచిన రాకపోకలు


