మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మైనర్లుకు ద్విచక్రవాహనాలు ఇచ్చే తల్లిదండ్రుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మోటారు వాహన చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండినవారు మాత్రమే వాహనాలు నడిపేందుకు అర్హులు. కానీ, ప్రస్తుతం పల్లెలు, పట్టణాలు, నగరాల్లో పదేళ్లు దాటిన వారికి సైతం తల్లిదండ్రులు వాహనాలు ఇస్తున్నారు. నియంత్రణ లేని పిల్లలు రోడ్లపై దూసుకుపోతూ ప్రమాదాలకు కారణమవుతూ కుటుంబ సభ్యులను క్షోభకు గురిచేస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే చట్ట ప్రకారం వారిపై కేసు నమోదు చేసి జరిమానా లేదా ఒకరోజు జువైనల్ హోంకు తరలిస్తున్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరిస్తునా.. కొందరు తల్లిదండ్రుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు.
వేసవి సెలవుల నేపథ్యంలో
ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ఇచ్చిన క్రమంలో వారందరూ ఇళ్ల దగ్గర ఉంటారు. ఈ సమయంలో ఖాళీగా ఉన్న వారిలో చాలామంది చిన్నారులు ఇంట్లో ఉండే తల్లిదండ్రుల బైక్‌లు, స్కూటీలు తీసుకొని గల్లీలతోపాటు ప్రధాన రోడ్లపై త్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్‌లతో చక్కర్లు కొడుతున్నారు. ఈ క్రమంలో కొన్నిచోట్ల ప్రమాదాలు చోటుచేసుకోవడంతో గాయపడుతున్న ఘటనలు అనేకం. ఇక కొన్ని సందర్భాల్లో ప్రధాన రోడ్లపై మేజర్ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు సైతం కోల్పోతున్న ఘటనలు లేకపోలేదు. ఇలాంటి ప్రమాదాల కట్టడికి మొదటి అడుగు ఇంట్లో తల్లిదండ్రుల నుంచి పడాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత పోలీస్ శాఖ ప్రత్యేక డ్రైవ్‌లు ఏర్పాటు చేసి తల్లిదండ్రులతోపాటు పిల్లలకు కౌన్సిలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉంది.
బైపాస్ రోడ్డుపై రేస్..
నగరంలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన పాలకొండ బైపాస్‌పై రాత్రివేళలో టీనేజర్స్ రేసింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా చించోళి బైపాస్ రోడ్డుపై కూడా సాయంత్రం వేళ కొంతమంది యువకులు బైక్‌లతో అక్కడికి చేరుకుని పోటీలు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఒక వర్గానికి చెందిన టీనేజర్స్ మరింత రెచ్చిపోయి బైక్‌లు ర్యాష్‌గా.. వేగంగా నడుపుతూ గట్టిగా హారన్స్ కొడుతూ.. సైలెన్సర్ల నుంచి మంటలు వచ్చేలా నడుపుతున్నారు. కొందరు అయితే బైక్ స్టాండ్స్ రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్తూ ఆనందిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలోగణనీయంగా పెరిగిన మైనర్ల డ్రైవింగ్
వేసవి సెలవులనేపథ్యంలో బైక్‌లపై టీనేజర్ల చక్కర్లు
పాలమూరులో రెండు బైపాస్ రోడ్లపై రేస్‌ల నిర్వహణ
పూర్తిస్థాయిలో
దృష్టిపెట్టని పోలీస్ శాఖ
తల్లిదండ్రులకు
అవగాహన కల్పిస్తున్నా మార్పు రాని వైనం


