మహబూబ్‌నగర్ రూరల్: రైతుల్లో భరోసా నింపేందుకు త్వరలో పాదయాత్ర నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు. శుక్రవారం ఆయన మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని రాంరెడ్డిగూడెం మిల్లు వద్ద వరి ధాన్యం అమ్మకం కోసం వాహనాల్లో సంచులు పెట్టుకొని వేచి ఉన్న రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర, సకాలంలో యూరియా, నాణ్యమైన విద్యుత్, రైతుబంధు, రైతుబీమా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై త్వరలో పాదయాత్ర ప్రణాళిక ప్రకటిస్తామన్నారు. పాదయాత్ర ద్వారా ప్రతి రైతును కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను వివరిస్తామని చెప్పారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో మిల్లర్లు రైతుల నుంచి అధిక తరుగు తీసుకుంటున్నారని, కొనుగోలు కేంద్రాలను అరకొరగా ఏర్పాటు చేసి తర్వాత ఎత్తివేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో కల్లాల వద్దే వడ్లు కొనుగోలు చేసి, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేశామని, రైతుల ఖాతాల్లో సమయానికి డబ్బులు జమ చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వారోత్సవాలు ఎందుకు నిర్వహిస్తుందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా సర్పంచ్‌లు, కార్పొరేటర్లు, నాయకులను డబ్బులతో కొనుగోలు చేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, కోటకదిర సింగిల్‌విండో చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.


