జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఈనెల నుంచి ప్రారంభం కానున్న ఇంటింటి జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని తెలంగాణ సెన్సస్ డైరెక్టర్ భారతి హోలీకేరి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఆమె వీసీ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో రెండో విడత జనగణనపై సమీక్షించగా.. మహబూబ్‌నగర్ నుంచి కలెక్టర్ ఖుష్బూ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చార్జి అధికారులు, సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లు తమకు కేటాయించిన బ్లాకులను మొదటి మూడు రోజులు (11, 12, 13)లలో తప్పనిసరిగా సందర్శించాలన్నారు. ఆయా బ్లాకుల్లో హెచ్‌బీఎల్ (హౌస్ బేస్డ్ లిస్టింగ్)ను పరిశీలించి.. లేఔట్ మ్యాప్‌ను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అలాగే 11 నుంచి ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటిని విధిగా సందర్శించి, గృహాల వారీగా జాబితా సిద్ధం చేసి వివరాలు నమోదు చేయాలన్నారు. గృహాల జాబితా తయారీ సమయంలో ఏ ఒక్క ఇంటిని కూడా వదలకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అలాగే మండల రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ నిర్వహించి, జనాభా గణన సర్వేను విజయవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జనగణన ప్రక్రియను ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు 100 శాతం విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుసూదన్‌నాయక్, హరిప్రియ, ఆర్డీఓ నవీన్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రవీంద్ర, మున్సిపల్ కమిషనర్ రామంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


