పరిశుభ్రమైన నీటితో చేపల ఉత్పత్తి మెరుగు | - | Sakshi
Sakshi News home page

పరిశుభ్రమైన నీటితో చేపల ఉత్పత్తి మెరుగు

May 9 2026 9:31 AM | Updated on May 9 2026 9:31 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): చెరువుల్లో కలుపు మొక్కలను తొలగించడం, పరిశుభ్రత పాటించడం, నీటి నాణ్యతను కాపాడడం ద్వారా చేపల ఉత్పత్తి పెరుగుతుందని జిల్లా మత్స్యశాఖ సహాయ సంచాలకురాలు రాధారోహిణి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మత్స్యకార సంఘాల సభ్యులకు చెరువులలో కలుపు మొక్కల నివారణ, చేపలలో వ్యాధుల నిర్మూలన, చేపల ఉత్పత్తి పెంచడంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేపల వ్యాధుల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, చేపలలో వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే మత్స్యశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. మత్స్యశాఖ అధికారులు శాసీ్త్రయ విధానాలతో చేపల పెంపకం, నాణ్యమైన చేప పిల్లల వినియోగం, మిశ్రమ చేపల పెంపకం, కేజ్‌ కల్చర్‌ విధానాలపై సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ పద్ధతుల ద్వారా అధిక దిగుబడితోపాటు ఆదాయం పెంచుకోవచ్చని వివరించారు. సదస్సుకు వివిధ మండలాల మత్స్యకార సహకార సంఘాల సభ్యులు, రైతులు హాజరై తమ సమస్యలను నివృత్తి చేసుకున్నారు. అనంతరం మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యకార పారిశ్రామిక సహకార సంఘం పర్సన్‌ ఇన్‌చార్జి శ్రీనివాస్‌, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్‌, జిల్లా ఉద్యానవన అధికారి వేణుగోపాల్‌, ఫిషరీస్‌ శాస్త్రవేత్తలు గణేష్‌, శేఖర్‌, గంగారాం, మత్స్యశాఖ క్షేత్రస్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement