గండేడ్: రుణాల రికవరీలో అక్రమాలపై పూర్తిస్థాయి విచారణలో జాప్యం జరుగుతున్నది. కేవలం తాత్కాలికంగా సప్పెన్షన్ వేటు వేశారు తప్పా.. క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విచారణ చేపట్టడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై పలు అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి గండేడ్ మండలంలో పీఏసీఎస్‌తోపాటు డీసీసీబీ ఉంది. వీటి ద్వారా రైతులకు పంట, దీర్ఘకాలిక, పిటీలోన్లు ఇచ్చారు. అయితే ఇచ్చిన రుణాల రికవరీలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. గతంలో పనిచేసిన ఓ బ్యాంకు మేనేజర్ పీఏసీఎస్ సిబ్బంది సహకారంతో కలిసి చేతివాటం ప్రదర్శించారు. అయితే ఇచ్చిన రుణాలు ప్రతిఏటా రికవరీ చేయడం.. అటు బ్యాంకు.. ఇటు పీఏసీఎస్ సిబ్బంది బాధ్యత. అందులో భాగంగానే ప్రతి ఆర్థిక సంవత్సరం ముగింపులోగా రుణాలు రికవరీ చేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని వారు రికవరీకిగాను నేరుగా లబ్ధిదారుల వద్దకెళ్లి రుణాలు కట్టాలంటూ ఒత్తిడి చేసేవారు. సిబ్బంది రికవరీకి రావడంతో రుణం తీసుకున్న లబ్ధిదారులు నానా తంటాలు పడి రుణాలు చెల్లించేవారు. రైతుల నుంచి రుణాల రికవరీ సందర్భంగా గ్రామాల్లోకి వెళ్లినప్పుడు హ్యాండ్ రిసిప్టులు ఇచ్చేవారు. అయితే అలా చెల్లించిన రుణం మాత్రం చెల్లించిన రైతుల ఖాతాల్లో స్క్రోల్‌గాని అక్కౌంట్‌కుగాని లెడ్జర్‌కుగాని పోలేదు. కొత్త మేనేజరు వచ్చాక రికవరీకి వెళ్లడంతో బాధితులు ఆయన దృష్టికి తీసుకువెళ్లడంతో వాస్తవాలు వెళ్లడయ్యాయి. బ్యాంకులో క్యాషియర్, పీఏసీఎస్‌లో సీఈఓ రిసీవ్డ్ రిసిప్టు ఇస్తాడు. వాటిపై ముద్రలతో సహా ఉంటాయి. కాని రైతులకిచ్చిన రిసిప్టులు డుప్లికేట్ హ్లాండ్ రిసిప్టులు ఇచ్చారు. కొన్ని సీలు, సిగ్నేచర్ లేకుండా ఇచ్చారు. దీంతో వారి ఖాతాల్లో జమ కాకపోవడంతో అప్పు అలాగే ఉండిపోయింది. అప్పు బాకీ వారినుంచి నేరుగా ఫోన్‌పే, గూగుల్ పే రూపంలో బ్యాంకు సిబ్బందికి పీఏసీఎస్ సిబ్బంది ఖాతాలకు డబ్బులు వేశారు. అయితే వీటిని వెంటనే వారి అప్పుఖాతాల్లో జమచేయకుండా మేనేజర్ స్వాహా చేశాడు. కొంరెడ్డిపల్లిలో పలువురు రైతులకు చెందిన డబ్బులు ఇదే తరహాలో స్వాహా అయ్యాయి. దీంతోపాటు జక్లపల్లిలో ఓ రైతు నుంచి కూడా ఫోన్‌పే ద్వారా రుణం కిస్తు వేయగా దానిని వారి ఖాతాల్లో జమచేయలేదు. ఆయన బదిలీ అనంతరం కొత్తగా వచ్చిన మేనేజరు ఆ రుణం గురించి ఆ రైతును అడగగా విషయం బయటికి వచ్చింది. రుణం కిస్తు రూ.35000 ఉండగా సదరు మేనేజరుకు రూ.45000 వేయించుకున్నట్లు సమాచారం. ఇవేకాక గోల్డ్‌లోన్ల రికవరీ ఉందని చెప్పి డబ్బులు వేయించుకొని లోన్ తీసుకున్నవారికి తెలియకుండా దానిని ఎక్కువ చేసి వారు వేసిన డబ్బులు కూడా జేబులో వేసుకున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.
ఆగమేఘాల మీద సర్దుబాటు
గండేడ్ మండలంలోని కొంరెడ్డిపల్లిలో పలు రైతుల డబ్బులు స్వాహా అవ్వడంతో విచారణ అనంతరం సదరు మేనేజర్‌ను సస్పెండ్ చేశారు. అయితే ఆ స్వాహా చేసిన డబ్బులు పీఏసీఎస్ సిబ్బంది ఖాతా ద్వారా సర్దుబాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఆగమేఘాల మీద ఈ డబ్బును సర్దుబాటు చేశారు. దీంతోపాటు జక్లపల్లి రైతు రుణాన్ని కూడా సర్దుబాటు చేశారు. అయితే విచారణలో వెల్లడైన వివరాల ఆధారంగా సస్పెండ్ చేసినా ఇప్పటివరకు పూర్తి విచారణ మాత్రం చేయడం లేదు. అంతేకాక కేవలం రెండు గ్రామాల్లో జరిగిన వాటిపైనే దష్టిపెట్టారు తప్పా.. మిగతా వాటిపై అధికారులు దృష్టిసారించలేదన్న విమర్శలు లేకపోలేదు. పీఏసీఎస్ రుణాలతోపాటు బ్యాంకు డైరెక్టు రుణాలపై కూడా పూర్తిస్థాయి విచారణ జరిపితే మరిన్ని లొసుగులు బయటికి వచ్చే అవకాశం ఉంది. 2022 సదరు మేనేజర్ పీఏసీఎస్ పూర్తిస్థాయిలో వసూళ్లు కాకపోయిన టార్గెట్ 50శాతం పూర్తయిందని తప్పుడు సమాచారం ఇచ్చి కొత్త అలాట్‌మెంటు తీసుకొని తిరిగి రుణాలు ఇచ్చి చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సమయంలో ఇతనికి బెస్టు రికవరీ ఆఫీసర్ అని ప్రశంసాపత్రం కూడా ఇవ్వడం విడ్డూరం. బ్యాంకులో ఉన్న పాసుపుస్తకాలు ఇతర రికార్డులు కాని జిరాక్స్ అవసరమొస్తే పీఏసీఎస్ సిబ్బందికి ఒకరికి బాధ్యత అప్పగించి రూ.వేయి చొప్పున కూడా వసూలు చేసినట్లు సమాచారం. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని క్షేత్రస్థాయిలో విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సస్పెండ్ అయిన మేనేజర్ రైతుల డబ్బులు సర్దుబాటు చేశాక.. సస్పెన్షన్ ఎత్తేయించుకొని తిరిగి విధుల్లో చేరడానికి ముమ్మర యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికిగాను అధికారుల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం. అక్రమాల్లో పీఏసీఎస్ సిబ్బంది హస్తం లేకపోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం ఒక్క మేనేజరే కాక పీఏసీఎస్ సిబ్బంది లీలలు మరిన్ని బయటకు వచ్చే అవకాశం ఉంది.
అక్రమాలు నిగ్గు తేల్చడంలో అలసత్వం
వచ్చిన ఫిర్యాదులపై మాత్రమే విచారణ
పూర్తిస్థాయి విచారణలో జాప్యం
రికవరీలో మరిన్ని అక్రమాలపై అనుమానాలు


