అలంపూర్: పట్టణంలో వెలిసిన హజ్రత్ షా అలీ పహిల్వాన్ ఉర్సు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు.
9 నుంచి 12వ వరకు ఉర్సు
హజ్రత్ షా అలీ పహిల్వాన్ ఉర్సును పురస్కరించుకొని 9న రాత్రి గంధోత్సవం ఉంటుంది. రాత్రి సయ్యద్ ఖాదర్ వలీ సాహెబ్ ఇంటి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి గంధం చేరుకుంటుంది. అక్కడ ప్రత్యేక ప్రార్థనల అనంతరం గంధాన్ని సర్ ముబారక్ దర్గాకు భక్త జనసందోహం మధ్య ఊరేగింపుగా తీసుకెళ్తారు. సర్ ముబారక్ దర్గాలో గంధం సమర్పించి ప్రత్యేక ప్రార్ధనలు చేస్తారు. చివరగా ధడ్ ముబారక్ దర్గాలకు గంధం తీసుకెళ్లి ప్రార్థనలు చేయడం ఆనవాయితీ. 10న సర్ ముబారక్ దర్గాలో చిన్న కిస్తి పోటీలు జరగనున్నాయి. 11న ధడ్ ముబారక్ దర్గా వద్ద పెద్ద కిస్తి పోటీలు నిర్వహిస్తారు. 12న ప్రత్యేక ఉర్సుతో ఉత్సవాలు ముగియనున్నట్లు పేర్కొన్నారు.
గుల్బర్గా నుంచి గంధం
ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా ఖాజా బందేనవాజ్ దర్గా నుంచి గంధాన్ని అలంపూర్‌లోని సయ్యద్ ఖాదర్ బాషా ఇంటికి తీసుకొస్తారు. అక్కడి నుంచి గంధాన్ని దర్గాలకు తీసుకెళ్లి ఉత్సవాలను ప్రారంభిస్తారు. ఉర్సులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు కల్పించనున్నారు.
బ్యాంకులో డబ్బులు
జమ చేసేందుకు వచ్చి మృతి
భూత్పూర్: బ్యాంకులో డబ్బులు జమ చేయడానికి వచ్చిన ఓ మహిళ గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. మండలంలోని కర్వెన గ్రామానికి చెందిన మర్కంటి లక్ష్మమ్మ(55) శుక్రవారం బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను డ్రా చేయడానికి భూత్పూర్‌లోని ఓ బ్యాంకుకు వచ్చి కూర్చొంది. అకస్మాత్తుగా కుర్చీలో కూర్చున్న చోటే కిందపడిపోవడంతో వెంటనే బ్యాంకుకు వచ్చిన ఇతర ఖాతాదారులు, బ్యాంకు సిబ్బంది పరిశీలించగా అప్పటికే ఆమె మృతిచెందింది. బ్యాంకుకు వచ్చిన కర్వెన గ్రామ మహిళా సంఘం సభ్యులు లక్ష్మమ్మను గుర్తించి.. బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను స్వగ్రామమైన కర్వెన గ్రామానికి తీసుకెళ్లారు. మృతురాలి భర్త ఇప్పటికే మృతిచెందగా.. సంతానం ఎవరూ లేరని గ్రామ సర్పంచ్ నాగరాణి తెలిపారు.


