నారాయణపేట రూరల్: పదో తరగతి విద్యార్థులకు ‘సాక్షి’ దినపత్రిక అందించిన స్టడీ మెటీరియల్ ఎంతో ఉపయోగపడిందని ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలిపారు. ఇటీవల విడుదలైన టెన్త్ ఫలితాల్లో జిల్లా వ్యాప్తంగా చాలామంది విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. సాక్షి యాజమాన్యం నిష్ణాతులైన అధ్యాపక బృందం ఆధ్వర్యంలో గణితం, భౌతికశాస్త్రం మెటీరియల్ రూపొందించి పదో తరగతి పరీక్షలకు రెండు నెలల ముందు విద్యార్థులకు అందించింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే బీద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచితంగా లభించిన ఈ స్టడీ మెటీరియల్ ఎంతో ఉపకరించిందని కొనియాడుతున్నారు. అదేవిధంగా పలు ప్రభుత్వ పాఠశాలలకు ‘సాక్షి’ దినపత్రికను అందించడంతో నిత్యం అందులో ప్రచురితమైన భవిత పేజీ సద్వినియోగం చేసుకున్నట్లు విద్యార్థులు చెప్పుకొస్తున్నారు. భవిత పేజీని ప్రతిరోజు టెన్త్ విద్యార్థుల వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తే వాటిని ఇంటికి వెళ్లి రివిజన్ చేసుకునేవారని, సందేహాలు ఉంటే మరుసటిరోజు నివృత్తి చేసుకునే వారిని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అత్యుత్తమ మార్కులు సాధించడంలో సాక్షి ఎంతో ఉపయోగపడిందని, భవిష్యత్‌లోనూ మరింత సహకారం అందించాలని కోరుకుంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరం అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మెటీరియల్‌తోపాటు తెలుగు మీడియం వారికి అందించాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా టాపర్‌గా నిలిచా
ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 587 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచా. డిసెంబర్‌లోగా ఉపాధ్యాయులు సిలబస్ పూర్తి చేసి రివిజన్ టెస్టులు నిర్వహించారు. దీనికితోడు సాక్షి మెటీరియల్ ద్వారా చదువుకోవడం మార్కులు పెరగడానికి ఎంతో ఉపకరించింది. – పూర్విక, మద్దూరు
స్టడీ మెటీరియల్
ఉపయోగపడింది
సాక్షి యాజమాన్యం అందించిన స్టడీ మెటీరియల్ మార్కుల సాధనలో ఎంతో ఉపయోగపడింది. కఠినమైన అంశాలను సులువుగా వివరించి అందించడంతో స్వయంగా చదువుకోవడానికి దోహదపడింది. చివరి రెండు నెలలు సాక్షి మెటీరియల్ పైనే ఆధారపడటంతో మంచి మార్కులు సాధించాను.
– నవనీత, కొలంపల్లి.
గణితంలో 95మార్కులు సాధించా
గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులం కావడంతో కొంత గణితంలో వెనకబడి ఉంటాం. ఎప్పుడూ లెక్కల సబ్జెక్ట్ లోనే మార్కులు తక్కువగా వచ్చేవి. అయితే పరీక్షల ముందు సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో ఉచితంగా ఇచ్చిన గణితం మెటీరియల్ నాకు ఎంతో ఉపయోగపడింది. రెగ్యులర్‌గా పుస్తకం ఫాలో కావడంతో గణితంలో 95మార్కులు సాధించాను. సాక్షికి ధన్యవాదములు.
– ఎల్లప్ప, భైరంకొండ
పాలిసెట్‌కు ఉపయోగిస్తున్న..
పరీక్షల ముందు సాక్షి దినపత్రిక అందించిన మెటీరియల్ ఎంతో ఉపయోగపడింది. గణితం, సైన్స్‌లో 90కి పైగా మార్కులతో మొత్తం 527 సాధించాను. పాలిసెట్‌లో సీటు సాధించేందుకు సైతం ఈ మెటీరియల్‌ను ఫాలో అవుతున్న. కష్టమైన వాటిని సులువుగా నేర్చుకుంటున్నా. –శిరీష, అమీన్‌పూర్
గణితం అంటే ఎంతో భయం ఉండేది. ప్రతి అధ్యాయం నుంచి పరీక్షల్లో రాయడానికి కష్టమైన లెక్కలను సులభమైన రీతిలో నమూనా ప్రశ్నలు విశ్లేషించి మెటీరియల్‌లో పొందుపరిచారు. తద్వారా లెక్కలు కష్టమన్న విద్యార్థుల్లో సాక్షి మెటీరియల్‌తో భయం పోయింది. ప్రధానంగా గణితం పరీక్షల్లో సమయాన్ని సమన్వయం చేసుకునేలా ఈ మెటీరియల్ ఉపయోగపడింది.
– మధుసూదన్, గణిత ఉపాధ్యాయులు, జాజాపూర్
పత్రికలు కేవలం సమస్యలు, ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే పనిలో నిమగ్నమై ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ సాక్షి దినపత్రిక అందుకు భిన్నంగా ఆలోచిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేయడం గొప్ప విషయం. ప్రతిరోజు భవిత పేజీలో కీలక అంశాలను తెలియజేస్తూనే కష్టమైన గణితం, సైన్స్ మెటీరియల్‌ను విద్యార్థులకు ఉచితంగా అందించడం శుభపరిణామం. భవిష్యత్‌లో తెలుగు మీడి యం విద్యార్థులకు అందించే విధంగా కృషిచేయాలి. – భానుప్రకాష్, జిల్లా సైన్స్ అధికారి
‘సాక్షి’ చేయూత మరువలేనిది
సాక్షి దినపత్రిక విద్యార్థుల కోసం అందించిన చేయూత మరవలేనిది. ఇంటర్‌తోపాటు టెన్త్ చదువుతున్న విద్యార్థులకు భవిత పేజీ ఎంతో ఉపయోగపడింది. ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్టుపై విశ్లేషణాత్మక విషయాలు, పాఠ్యాంశం వారీగా చదవాల్సిన అంశాలు చాలా బాగున్నాయి. మంచి ఫలితాలు సాధించడానికి సహకరించడం ఆనందంగా ఉంది.
– శ్రీ విద్య, గురుకుల స్కూల్, నారాయణపేట
మంచి ప్రోత్సాహం అందించింది
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాక్షి ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది. ఆంగ్ల మాధ్యమంలో ప్రింట్ చేసిన మెటీరియల్ కొన్ని పుస్తకాలు మా పాఠశాలకు అందించారు. వాటిని ఉపాధ్యాయులు తెలుగులో తర్జుమా చేసి రోజువారీగా చదివించడం ఎంతో ఉపయోగపడింది. మెటీరియల్ ఆధారంగా పరీక్షలకు సిద్ధం కావడంతో మంచి ఫలితాలు సాధించాం.
– అక్షిత, కేజీబీవీ, నారాయణపేట
స్టడీ మెటీరియల్ సహకారంతో ఉత్తమ ఫలితాలు
ఎంతో ఉపకరించిందని కొనియాడిన విద్యార్థులు
సాక్షి పత్రికకు ధన్యవాదాలు తెలిపిన ఉపాధ్యాయ బృందం


