అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు

May 8 2026 1:19 PM | Updated on May 8 2026 1:19 PM

మెట్టుగడ్డ: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు అందేవరకు యూనియన్‌ అండగా ఉంటుందని ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్‌ అలీ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రెస్‌క్లబ్‌ ప్రతినిధులపైనా రాజకీయ కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా పోలీసులు అక్రమంగా నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. కేవలం సోషల్‌ మీడియా పోస్టులను సాకుగా చూపి జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. రాజకీయ నాయకులు జర్నలిస్టుల మధ్య ఉండే ఆరోగ్యకరమైన సంబంధాలు ఇలాంటి కేసులు దెబ్బతీస్తాయని, జర్నలిస్టుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తే సహించేది లేదని పేర్కొన్నారు. జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలుపునిస్తామని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో జర్నలిస్టులపై దాడులు, వేధింపులు జరిగితే యూనియన్‌ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో యునియన్‌ కార్యదర్శి శ్రీకాంత్‌ రెడ్డి, రాములు, ఐజేయూ జిల్లా అధ్యక్షులు నాగరాజుగౌడ్‌, పాషా, కార్యదర్శి సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement