● రిజర్వాయర్‌లో ఏడు మీటర్లుతగ్గిన నీటిమట్టం
● ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో మిషన్ భగీరథ అధికారులు
● నేటినుంచి ప్రత్యేక అధికారి పాలనలో జడ్చర్ల పురపాలికం
రామన్‌పాడు తగ్గుముఖం
జడ్చర్ల టౌన్: జడ్చర్ల మున్సిపాలిటీలో గురువారం నుంచి ప్రత్యేక అధికారి పాలన ప్రారంభం కానుంది. పాలకవర్గ సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించి వీడ్కోలు పలికారు. 2011 మార్చిలో అప్పటి గ్రామపంచాయతీ పాలకవర్గం గడువు ముగియటంతో ప్రత్యేక అధికారి పాలన ప్రారంభమైంది. అప్పటి నుంచి 2021 వరకు బాదేపల్లి ప్రత్యేక అధికారి పాలనలోనే కొనసాగింది. మధ్యలో జడ్చర్ల మేజర్ గ్రామపంచాయతీకి 2016లో ఎన్నికలు జరిగి ఐదేళ్ల పాటు సర్పంచ్, వార్డుసభ్యుల పాలన కొనసాగింది. బాదేపల్లి మాత్రం మార్చి, 2011 నుంచి మే, 2021 వరకు ప్రత్యేకాధికారి పాలనలోనే ఉండింది. గ్రహణం వీడి 2021 ఏప్రిల్‌లో ఎన్నికలు జరగగా.. మే 6న పాలక వర్గం ప్రమాణస్వీకారం చేసింది. ఐదేళ్ల గడువు ముగియటంతో ఇక ప్రత్యేక పాలన అనివార్యమైంది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో స్పష్టత కొరవడటంతో అప్పటి వరకు అధికారుల ఆధ్వర్యంలోనే మున్సిపాలిటీలో పాలన కొనసాగనుంది.
ఘనంగా వీడ్కోలు..
పాలకవర్గానికి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఘనంగా వీడ్కోలు పలికారు. మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి.. చైర్‌పర్సన్ పుష్పలత, వైస్ చైర్‌పర్సన్ పాలాది సారికతో పాటు వార్డు కౌన్సిలర్లను సత్కరించి మెమొంటోను అందజేశారు.
చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలి
పాలకవర్గం గడువు ముగిసినందున అధికారులు చిత్తశుద్ధితో నిబంధనలకు అనుగుణంగా పాలన సాగించాలని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆదేశించారు. పాలకవర్గం ఉన్నపుడు కొంత ఆచితూచి వ్యవహరించినా ఇప్పుడు మాత్రం అలా కాకుండా ప్రజలకనుగుణంగా పని చేయాలన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కౌన్సిలర్లుగా పదవి గడువు ముగిసినప్పటికీ రాజకీయాల్లో మాత్రం చురుకుగా ఉండాలని పాలకవర్గ సభ్యులకు సూచించారు. ప్రజాసమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చూడాలని, పార్టీలను పక్కన బెట్టి అందరూ కలసి ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు చేయాలని సూచించారు.
ఆత్మకూర్: ఉమ్మడి జిల్లాలో ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్న రామన్‌పాడు రిజర్వాయర్‌లో రోజురోజుకు నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. ఇప్పటివరకు ఏడు మీటర్ల మేర నీటిమట్టం తగ్గింది. ఒకవేళ రిజర్వాయర్‌లో నీటిమట్టం పూర్తిగా తగ్గితే పాలమూరులోని అనేక గ్రామాలు తాగునీటి ఎద్దడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొననుంది. ప్రధానంగా మిషన్ భగీరథ పథకం ద్వారా నిత్యం వనపర్తి జిల్లాలోని 6.46 లక్షల మందికి 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో మే, జూన్ నెలల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటూ బోరుబావులు, చేతిపంపులు, ట్యాంకర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా రామన్‌పాడు రిజర్వాయర్‌ను నిర్మించారు. రిజర్వాయర్‌లోని నీటితో పాటు జూరాల ప్రధాన, సమాంతర కాల్వ ద్వారా నిత్యం తాగు, సాగునీటి సరఫరా కొనసాగుతోంది. గతంలో రామన్‌పాడు రిజర్వాయర్ నుంచి ఉమ్మడి జిల్లాలోని 500 గ్రామాలకు 30 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేస్తుండేవారు. ప్రస్తుతం శ్రీశైలం వెనుక జలాల నుంచి పలు పథకాలకు తాగునీరు సరఫరా అవుతుండటంతో రామన్‌పాడుపై భారం తగ్గింది. ప్రస్తుతం రెండు పథకాలకు 10.4 ఎంఎల్‌డీ నీటిని వినియోగిస్తున్నారు. రిజర్వాయర్‌లో 1022.06 అడుగుల నీటిమట్టం ఉండాల్సి ఉండగా.. బుధవారం 1020.09 అడుగులకు చేరింది.
తాగునీటి పథకాలు..
శ్రీశైలం వెనుక జలాల నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా గౌరిదేవిపల్లి 77 ఎంఎల్‌డీ తాగునీటి పథకం ద్వా రా వనపర్తి జిల్లాలోని 8 గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారు. అలాగే గోపాల్‌పేట 10 ఎంఎల్‌డీ ప థకం ద్వారా 44 గ్రామాలు, బుగ్గపల్లి 75 ఎంఎల్ డీ పథకం ద్వారా 87 గ్రామాలు, పాన్‌గల్ 5 ఎంఎల్‌డీ పథకం ద్వారా 19 గ్రామాలు, వీపనగండ్ల 4 ఎంఎల్‌డీ పథకం ద్వారా 20 గ్రామాలు, ఆత్మకూర్ 2.4 పథకం ద్వారా 12 గ్రామాలు, నందిమళ్ల సత్య సాయి 2 ఎంఎల్‌డీ పథకం ద్వారా 12 గ్రామాలు, కొల్లాపూర్ 31 ఎంఎల్‌డీ పథకంద్వారా 58 గ్రామాలకు నిత్యం తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పురపాలికలకు 27.6 ఎంఎల్‌డీ, గ్రామాలకు 48.435 ఎంఎల్‌డీ నీటిని అందిస్తున్నారు.
సాగునీటి సరఫరా బంద్..
ఇదిలా ఉండగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ద్వారా నిత్యం 350 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేస్తుండేవారు. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోవడంతో ఉన్న నీటిని ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలకు కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. పీజేపీ, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో ముందుకెళ్తే తాగునీటి కష్టాలు తలెత్తవు.


