ఆక్రమణలకు అడ్డేది? | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణలకు అడ్డేది?

May 7 2026 9:20 AM | Updated on May 7 2026 9:20 AM

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: నగరంలో కబ్జాదారుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. చెరువులు, కుంటలే లక్ష్యంగా యథేచ్ఛగా ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. అయినా అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. పైగా అవి పాతవే.. కొత్త కబ్జాలు లేవంటూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రమక్రమంగా కనుమరుగవుతున్న చెరువులు.. ఆక్రమణదారుల బరితెగింపు బాగోతంపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌..

గతంలోనివే అంటూ...

మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండల పరిధిలో 31 చెరువులు, కుంటలు దాదాపు 800 ఎకరాల్లో విస్తరించి ఉండగా.. పలుచోట్ల అక్రమ కట్టడాలు వెలసినట్లు నీటిపారుదల అధికారులు ఇదివరకే గుర్తించారు. మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌గా అవతరించిన క్రమంలో ఆక్రమణదారులు మరింత బరి తెగించారు. చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్ల పరిధిలో అనుమతుల్లేకుండా ప్లాట్లుగా చదును చేస్తున్నారు. కొన్నిచోట్ల భవనాలు నిర్మిస్తున్నారు. శ్రీనివాసకాలనీ సమీపంలోని పాలకొండ చిన్న చెరువులో ఏకంగా మొరంతో రోడ్డు వేశారు. ఇవన్నీ కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. కబ్జాదారులు పెట్రేగిపోతుండగా.. కలెక్టరేట్‌లో ప్రతివారం జరిగే గ్రీవెన్స్‌సెల్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. దీనిపై రెండు నెలల్లో 15కు పైగా అర్జీలు అందాయి. అయినా అధికారులు గతంలోనివే అంటూ కొట్టిపారేస్తుండడంతో అటు నీటిపారుదల, ఇటు కార్పొరేషన్‌ అధికార యంత్రాంగం తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమ్యామ్యాలు అందుతుండడంతోనే పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనూ ఎన్‌ఓసీలు..

మహబూబ్‌నగర్‌ నగరం విస్తరిస్తున్న కొద్దీ చుట్టుపక్కల చెరువులు, కుంటలతో పాటు పాటు కాల్వలు సైతం కబ్జాలకు గురవుతున్నాయి. ఏనుగొండ మొదలుకుని పాలకొండ మీదుగా బండమీదిపల్లి, పీయూ.. వీరన్నపేట (చక్కనిరాయి) సమీపంలో నుంచి చిన్నదర్పల్లి వరకు బైపాస్‌ ఏర్పడడంతో చుట్టుపక్కల భూములకు డిమాండ్‌ పెరిగింది. దీంతో నగరం శివారుతో పాటు నడిబొడ్డున ఉన్న ఆయా చెరువుల శిఖం భూములపై అక్రమార్కుల కన్నుపడింది. ఇటీవల నీటిపారుదల శాఖ నుంచి కొందరు నిబంధనలకు విరుద్ధంగా ఎన్‌ఓసీలు పొంది ఎఫ్‌టీఎల్‌ పరిధిలో యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నా.. పట్టించుకునేనాథుడే కరువయ్యాడు. ప్రధానంగా రెవెన్యూ, మున్సిపల్‌, నీటిపారుదలశాఖల మధ్య సమన్వయ లోపం.. కొందరు అధికారుల చేతివాటం కబ్జాదారులకు దన్నుగా మారినట్లు తెలుస్తోంది.

నగరంలో యథేచ్ఛగా చెరువుల కబ్జా

గతంలోవే అంటూ అధికారుల కొట్టివేత

ఫిర్యాదులు చెత్తబుట్ట పాలు

కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌కు రెండు నెలలుగా15కి పైగా అర్జీలు

‘అధికార’ యంత్రాంగం తీరుపై విమర్శలు

Advertisement
 
Advertisement
Advertisement